న్యూఢిల్లీ: సీబీఐకి కొత్త చీఫ్ ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు హైపవర్ సెలెక్షన్ కమిటీ సోమవారం నాడు సమావేశమైంది. ముగ్గురు ఐపీఎస్ అధికారుల జాబితాను సిద్దం చేశారు. ఇవాళ సీబీఐ కొత్త బాస్ పేరును ప్రకటించనున్నారు. సీబీఐ డైరెక్టర్ పదవి కోసం ఎస్ఎస్‌బీ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష చంద్ర, హోం మంత్రి స్పెషల్ సెక్రటరీ విఎస్‌కె కౌముదీ, సీఐఎస్ఎస్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ జైశ్వాల్ పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు.సోమవారం నాడు ప్రధాని మోడీ నివాసంలో మోడీతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌ససభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి లు  సమావేశంలో  పాల్గొన్నారు.

సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం డీపీఓటీ మే 11వ తేదీన 109 మంది ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. ఈ సమావేశంలో విపక్షనేత సుమారు 93 పేర్లను తొలగించారని సమాచారం. కేవలం 16 పేర్ల విషయంలోనే ఆయన సానుకూలంగా ఉన్నారని తెలిసింది. అంతేకాదు సమావేశాన్ని వాయిదా వేయాలని ఆయన కోరాడు. అయితే సమావేశం వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదని తెలిసింది.

డీపీఓటీ పంపిన పేర్లలో ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి, విజయ్‌ కుమార్ సింగ్, సోమేష్ గోయల్, అరవింద్ కుమార్ , సుమంత్ కుమార్ గోయెల్, రాకేష్ ఆస్థానా, వైసి మోడీ, ఎస్ఎస్ జైస్వాల్, సుబోధ్ కుమార్ జైస్వాల్, రాజేష్ చంద్ర, అరుణ్ కుమార్, లోక్‌నాథ్ బెహెరా, విఎస్‌కె కౌముది, అభయ్ పేర్లున్నాయి. డీఓపీటీ పంపిన పేర్లలో ఐదుగురు ఇప్పటికే రిటైరైన విషయాన్ని అధిర్ రంజన్ చౌధురి సమావేశంలో గుర్తు చేశారు. సీబీఐ చీఫ్ పోస్టు ఎంపిక  విషయాన్ని డీఓపీటీ  పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

ఈ విషయమై లోక్‌సభలో విపక్షనేత చౌదురి తన అసమ్మతిని నమోదు చేశారు. 1985 బ్యాచ్ కు చెందిన మహారాష్ట్ర కేడర్ అధికారి సుబోథ్ జైశ్వాల్ ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ చీఫ్ గా కొనసాగుతున్నారు. తెల్గీ స్కామ్ ను విచారించిన అనుభవం ఆయనకు ఉంది.  ఈయన పేరును సీబీఐ డైరెక్టర్ పోస్టుకు ఎంపిక చేసిన షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఈయన పేరు కూడ ఉంది.

 1985 బ్యాచ్ కు చెందిన బీహార్ కేడర్ అధికారి కుమార్ రాజేష్ చంద్ర పేరును  సీబీఐ డైరెక్టర్ పోస్టుకు షార్ట్ లిస్టులో ఉంది.1985 బ్యాచ్ కు చెందిన ఆంధ్ర కేడర్ అధికారి వీఎస్‌కే కౌముది పేరు కూడ సీబీఐ డైరెక్టర్ పదవికి షార్ట్ లిస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.