చండీగఢ్: పంజాబ్ లో జరిగిన ఓ పేలుడులో ముగ్గురు మరణించగా, 9 మంది దాకా గాయపడ్డారు. ఫైర్ క్రాకర్స్ ను తరలిస్తున్న ట్రాక్టర్ ట్రాలీలో మంటలు లేచాయి. ఈ సంఘటన తరన్ తారన్ కు సమీపంలోని దలేకా గ్రామంలో జరిగిన నగర కీర్తన కార్యక్రమంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని, పలువురు గాయపడ్డారని పోలీసు సూపరింటిండెంట్ జగ్జీత్ సింగ్ చెప్పారు.  పహువింద్ గ్రామంలోని గురుద్వారా బాబా దీప్ సింగ్ నుంచి ఊరేగింపు బయలుదేరి  భిక్వీండ్ సబ్ డివిజన్ లోనిచబ్బా గ్రామంలో గల గురుద్వారా తాహ్లా సాహిబ్ వద్దకు వెళ్తుండగా సాయంత్రం నాలుగున్నర గంటలకు తరన్ తారన్ - అమృత సర్ రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది.

ఉరేగింపు గమ్య స్థానానికి చేరుకోవడానికి కొద్ది సమయం ముందు రసాయనాలు నిల్వ చేసిన ట్రాక్టర్ లోని ట్రయలర్ లో పేలుడు సంభవించింది. ట్రయలర్ లో ఆరేడుగురు టీనేజర్లు ఉన్నారు. ట్రయలర్ లో నిల్వ చేసిన రసాయనాల ద్వారా ఊరేగింపులో వాళ్లు గన్ షాట్స్ వంటి ధ్వనులు చేస్తున్న సమయంలో ఆ ప్రమాదం జరిగింది.

మృతులను గురుప్రీత్ సింగ్, మన్ ప్రీత్ సింగ్ లుగా గుర్తించారు. గాయపడినవారిని కూడా గుర్తించారు. వారిని తరన్ తారన్, సివిల్ ఆస్పత్రికి, అమృతసర్ లోని గురు నానక్ దేవ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.