రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జర్నలిస్టుల మృతి.. కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున సాయం ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందారు.

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందారు. సలామత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన ట్రక్కు వారి బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు స్థానిక జర్నలిస్టులు మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. లంబాఖేడా సమీపంలోని మలుపులో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సలామత్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దేవేంద్ర పాల్ తెలిపారు. రాజేష్ శర్మ, సునీల్ శర్మ, నరేంద్ర దీక్షిత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనంతో చెప్పారు. అనంతరం బర్ఖెడీ సమీపంలో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ముగ్గురు జర్నలిస్టులు.. వారి వీక్లీ పబ్లికేషన్ కోసం భోపాల్‌లో ప్రింటింగ్ ఆర్డర్ చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
‘‘విదిశ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రాజేష్ శర్మ, తోటి జర్నలిస్టులు సునీల్ శర్మ, నరేంద్ర దీక్షిత్ ఒక ప్రమాదంలో మరణించారని విచారకరమైన వార్త అందింది. మరణించిన ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ దుఃఖ సమయంలో మేము మృతుల కుటుంబానికి తోడుగా ఉన్నాం. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున అందజేస్తాం’’ అని శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.