Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ఏరియాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.

three jaishe terrorists killed in an encounter in south kashmir's   pulwama
Author
Srinagar, First Published Aug 21, 2021, 1:13 PM IST

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని నిర్వీర్యం చేసిన తర్వాత అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేసిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ తరహా ఆంక్షలు దీర్ఘకాలం అమలయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆంక్షలు క్రమంగా సడలుతున్నాయి. 370 నిర్వీర్యం తర్వాత తొలిసారిగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన మొబైల్ నెట్‌వర్క్ సేవలు కొనసాగాయి. కశ్మీర్‌లో ఆంక్షలు క్రమంగా ఎత్తేస్తుండగా పౌరులకు స్వేచ్ఛ లభిస్తుండటంతోపాటు ఉగ్రవాదులు తిరిగి రెచ్చిపోతున్నారు. ఇటీవలి నెలల్లో జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు
మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా, దక్షిణ కశ్మీర్ జిల్లా పుల్వామాలోని త్రాల్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.

త్రాల్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆర్మీ సహా సీఆర్‌పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. పోలీసులు సమీపిస్తుండగానే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలూ ఎదురుకాల్పులు జరిపాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. వారి వివరాలను ఇంకా ధ్రువీకరించలేదు. కానీ వారు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులని గుర్తించారు. ఘటనాస్థలి నుంచి మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో కశ్మీర్‌లో ఇది రెండో ఎన్‌కౌంటర్. మంగళవారం నుంచి ఇది మూడోది. శ్రీనగర్‌లోని క్రూవ్ ఏరియాలో శుక్రవారం ఇద్దరు టెర్రరిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. దక్షిణ కశ్మీర్‌లో సాధారణ పౌరులను చంపిన ఘటనలో వీరి ప్రమేయమున్నదని పోలీసులు తెలిపారు. అంతకు ముందటి రోజు రజౌరీ జిల్లాలో కాల్పుల్లో ఓ జూనియర్ ఆర్మీ అధికారిని తీవ్రవాదులు బలితీసుకున్నారు. ఇదే ఘటనలో ఓ ఉగ్రవాదీ హతమయ్యాడు. కొన్ని నెలలుగా కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలను హత్యగావిస్తున్న ఘటనలూ పెరుగుతున్నాయని వివరించారు. గురువారం జేకే అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోనె ఇంటిలోకి ఉగ్రవాదులు చొరబెట్టి చంపేసిన ఘటన కలకలం రేపింది.

Follow Us:
Download App:
  • android
  • ios