నిజామాబాద్: మూడు రోజుల వ్యవధిలో ఓ కుటుంబంలో ముగ్గురు మరణించారు. అనారోగ్యంతో మరణించిన మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు గుండెపోటుతో మృతి చెందాడు. అల్లుడి మరణవార్త విని అత్త తుదిశ్వాస విడిచింది. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో జరిగింది. 

మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు మరణించడంతో విషాద వాతావరణం చోటు చేసుకుంది. చేపూరు గ్రామానికి చెందిన గడ్డం మల్కన్న, మల్కవ్వ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు వారందరికీ వివాహాలు అయ్యాయి. 

మల్కన్న (60) అనారోగ్యంతో శుక్రవారంనాడు మరణించాడు కూతుళ్లు, అల్లుళ్లు వచ్చి అంత్యక్రియలు చేశారు అంత్యక్రియల తర్వాతి కార్యక్రమాల కోసం అక్కడే ఉన్నారు ఆదివారం చిన్న కూతురు సాయవ్వ భర్త లక్ష్మణ్ (45) గుండెపోటుతో మరణించాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం నిర్మల్ జిల్లా తండ్రాలకు తీసుకుని వెళ్లారు. 

మల్కన్న భార్య మల్కవ్వకు అల్లుడు మరణించిన విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, అల్లుడు మరణించినట్లు మధ్యాహ్నం తెలిసిందే. దాంతో మల్కవ్వ తీవ్ర దిగ్భ్రాంతికి గురై మరణించింది. ఆమె కూడా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మల్కన్న, మల్కవ కుమారుడు గంగాధర్ నిరుడు అనారోగ్యంతో మరణించాడు.