దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మండ్వాలీ రైల్వేస్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై మహిళ, ఇద్దరు బాలికల మృతదేహాలు ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ప్రమాదం జరిగిందా..? లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్నది తెలియరావాల్సి వుంది. అయితే మృతదేహాల పక్కనే ఓ బాలుడు స్వల్ప గాయాలతో ఏడుస్తూ కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. అటు రైల్వే అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గాయాలతో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మూడు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

మృతులను రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల దగ్గర ఓ ఫోన్ దొరికింది.

దీని ఆధారంగా మృతుల వివరాలను నిర్థారించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మహిళను మండ్వాలి సమీపంలో నివసిస్తున్న కిరణ్‌గా గుర్తించారు. భర్తతో గొడవ పడ్డాక, తన పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.