తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ సారా తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ సారా తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. మరకానం పరిసర ప్రాంతంలో శనివారం కొందరు వ్యక్తులు కల్తీ సారాను తాగారు. అయితే వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కల్తీ సారా తాగి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆరుగురు అపస్మారక స్థితిలో పడిపోయారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. మరికొందరికి కూడా ఇదే రకమైన పరిస్థితి ఎదుర్కొవడంతో వారిని కూడా ఆస్పత్రులకు తరలించారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ముగ్గురు మృతిచెందారు. మరో 16 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలను సేకరించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ శ్రీనాథ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. కల్తీ సారా విక్రయానికి సంబంధించిన తదుపరి విచారణ కోసం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ సారా బాధితులను విల్లుపురం జిల్లా కలెక్టర్ సి పళని, ఎస్పీ శ్రీనాథ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
