Uttar Pradesh: మట్టి దిబ్బ కూలి ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

soil mound collapse in Etah: మట్టి దిబ్బ కూలి ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న గురించి స్థానికులు, పోలీసులు వెల్ల‌డించిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూపీలోని ఎటా జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం మట్టి దిబ్బ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆ ముగ్గురు చిన్నారులు స్నేహితులు. ఆడుకుంటున్న క్ర‌మంలో ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. 

మృతులు సచిన్ (12), గోవింద్ (13), కౌశల్ (13)లు మధ్యాహ్నం ఆడుకుంటూ బయటికి వెళ్లారు. ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయారు. సాయంత్రం, గ్రామస్థులు వారి కోసం వెతకగా, మట్టి దిబ్బ కింద ఉన్న‌ట్టు గుర్తించారు. పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో పాటు వారిని బ‌య‌ట‌కు తీయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ విషాద ఘటన నయాగావ్ పోలీసు పరిధిలోని ఫకీర్‌పురా గ్రామ శివారులో చోటుచేసుకుంది. అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ధనంజయ్ కుష్వాహ మాట్లాడుతూ.. "స్థానిక రైతుల కుమారులు, పిల్లలు ఆడుకుంటూ మట్టి దిబ్బ కింద 'సొరంగం' నిర్మించారు, అది అకస్మాత్తుగా కూలిపోయి లోపల చిక్కుకుపోయార‌ని చెప్పారు. 

అయితే, "వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక నివాసితులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. వారిలో కొందరికి మట్టి కుప్ప సమీపంలో వారి చెప్పులు, కొన్ని బట్టలు చూశారు. పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం డెడ్ బాడీల‌ను పోస్ట్‌మార్టం కోసం పంపారు" అని ఏఎస్పీ తెలిపారు. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ వల్ల ఏర్పడిన కుహరాల కారణంగా మట్టి దిబ్బ కూలిపోయింది. బాధితులు పేద కుటుంబాలకు చెందినవారు. వారి కుటుంబాలకు సరైన నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


రాజ‌స్థాన‌ల్ లోనూ మ‌ట్టిదిబ్బ కూలి ఆరుగురు మృతి.. 

రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలోని సపోత్రా సబ్‌డివిజన్‌లోని సిమిర్ గ్రామంలో మట్టి దిబ్బ కూలి ఆరుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మ‌రో నలుగురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. స‌మాచారం అందిన వెంట‌నే ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరో మహిళతో పాటు ఇద్దరు బాలికలు కూడా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని.. ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. సపోత్రా సబ్‌డివిజన్‌లోని సిమర్ గ్రామ పంచాయతీ మేడ్‌పురా గ్రామానికి చెందిన మహిళలు, బాలికలు మధ్యాహ్నం తమ పొలాల వైపు వెళ్తున్నారు. ఆపై చదును చేయని రోడ్డు గుండా వెళుతుండగా ఒక్కసారిగా మట్టి కుప్ప కూలిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. శిథిలాల మధ్య సమాధి కావడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.