తమిళనాడులో ఓ దళిత యువకుడిపై నలుగురు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. అతనిపై మూత్ర విసర్జన చేసి జుగుస్సాకరంగా అవమానించారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెడితే.. బాధితుడైన దళిత యువకుడు, అతని స్నేహితులతో కలిసి  చెరువులో చేపలు పడుతుండగా, తనికొండన్‌ గ్రామానికి చెందిన ప్రదీప్‌ అనే యువకుడితో వాగ్వాదం జరిగింది. దీంట్లో ప్రదీప్ దళిత యువకులపై కులంపేరుతో దూషణలకు దిగాడు. 

దీంతో ఆపకుండా ప్రదీప్ కాసేపటికి తన ముగ్గురు స్నేహితులతో  కలిసి వచ్చాడు. దళిత యువకుడిని బలవంతంగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడిపై భౌతిక దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. 

దీంతో ఊరుకోకుండా ఆ యువకుడి ఒంటిపై మూత్ర విసర్జన చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. దీనిమీద దర్యాప్తు చేపట్టామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.