ఓ మహిళా డ్యాన్సర్ పై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా.. బాధితురాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఐదు రోజుల కిందట ఓ షోలో పాల్గొనేందుకు వచ్చిన 20 సంవత్సరాల డ్యాన్సర్‌పై కన్నేసిన ముగ్గురు నిందితులు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. హర్యానా నుంచి బస్సులో ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌ వద్దకు చేరుకున్న యువతికి ముగ్గురు నిందితులు మాయమాటలు చెప్పి ఈవెంట్‌ జరిగే వేదిక వద్దకు తీసుకువెళతామని నమ్మబలికారు.

ఆమెను బవానా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని, తిరిగి ఆమెను ఖజురి చౌక్‌ ప్రాంతంలో విడిచిపెట్టి బాధితురాలి సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితులు లోకేష్‌ (21), హృషీకేష్‌(25), ఓం (25)లను అరెస్ట్‌ చేశామని వెల్లడించారు.