కర్ణాటకలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.. హత్యలో ఐదుగురు భాగస్వామ్యం పాలుపంచుకుని ఉండొచ్చని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. దర్యాప్తు మొదలైందని, హర్ష హత్యకు గల కారణాలు త్వరలోనే వెల్లడి అవుతాయని వివరించారు.
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో భజరంగ్ దళ్(Bajrang Dal) కార్యకర్త హత్యతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో శివమొగ్గ(Shivamogga) జిల్లాలో కొందరు దుండగులు ఆయనను కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్యతో కమలం పార్టీ కార్యకర్తలు, భజరంగ్ దళ్ సహా పలు అనుబంధ సంఘాల కార్యకర్తలూ ఆందోళనలకు దిగారు. దీంతో పలుచోట్ల ఆంక్షలు అమలు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడారు. భజరంగ్ దళ్ కార్యకర్త , ఏళ్ల హర్ష హత్య(Murder)లో ఐదుగురి ప్రమేయం ఉన్నట్టు తెలిసిందని వివరించారు. అయితే ఇప్పటి వరకు ముగ్గరు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. వారిని ఎక్కడ పట్టుకున్నామో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.
కస్టడీలోకి ఎంత మందిని తీసుకున్నారో తనకు స్పష్టంగా తెలియదని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ దర్యాప్తులో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు తెలియవస్తాయని పేర్కొన్నారు. శివమొగ్గలో ఈ హత్య వార్త బయటకు రాగానే హింసాత్మక ఆందోళనలు జరిగాయి. కొందరు దుండగులు వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొందరు రాళ్లు విసిరారు. దీంతో వెంటనే సుమారు 1,200 మంది అదనపు పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరింపజేశామని చెప్పారు. బెంగళూరు నుంచి 200 మంది పోలీసులు పంపినట్టు వివరించారు.
అదనపు డీజీపీ మురుగన్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని హోం మంత్రి తెలిపారు. ప్రస్తుతం శివమొగ్గలో శాంతి భద్రతలు నెలకొన్నాయని, పరిస్థితులు అదుపులోకి తెచ్చారని చెప్పారు. ఈ రోజు ఉదయం తాను హర్ష కుటుంబాన్ని కలిశారని వివరించారు. తమ కొడుకును ఇప్పుడు వెనక్కి తేలేమని, కానీ, ఆయన మరణం వృథాగా పోవద్దని, న్యాయం జరగాలని కోరినట్టు హోం మంత్రి అన్నారు.
హర్ష హత్యకు హిజాబ్ వివాదానికి మధ్య సంబంధం ఉన్నదా? అనే విషయంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు వెల్లడైంది. రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప.. ఈ హత్యపై స్పందిస్తూ హిజాబ్ వివాదంతో సంబంధం ఉన్నదన్నట్టుగానే మాట్లాడారు. కొందరు ముస్లిం రౌడీలు హర్షను హత్య చేశారని పేర్కొన్నారు. శివమొగ్గలోని ఓ కాలేజీలో జాతీయ జెండా స్థానంలో కాషాయ జెండాను ఎగరేశారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రెచ్చగొట్టారని అన్నారు. ఆయన రెచ్చగొట్టడం కారణంగా కొందరు హర్షను హత్య చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు కొట్టి పారేశారు.
హిజాబ్ వివాదంతో హర్ష హత్యకు సంబంధం ఉన్నదనే వాదనలను కర్ణాటక పోలీసు అధికారి ఒకరు కొట్టి పారేశారు. శివమొగ్గ జిల్లాలోని దొడ్డపేటలో ఈ ఘటనపై కేసు నమోదైందని వివరించారు. ఈ ఘటనలో తమకు కొన్ని క్లూలు లభించాయని పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. దీనికి హిజాబ్ వివాదంతో సంబంధమే లేదని అన్నారు. హర్షకు ఆ గ్యాంగ్‌తో ఇది వరకే పరిచయాలు ఉన్నాయని వివరించారు. బహుశా వారి మధ్య పాత కక్ష్యల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.
