ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామ హత్యకు కుట్ర పన్నినట్లుగా వార్తలు రావడం కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలోని రామ్‌నగర‌లో ఎన్ఐఏ బృందం జరిపిన దాడుల్లో జేఎంబీ ఉగ్రవాది మునీర్‌ను అరెస్ట్ చేశారు

ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామ హత్యకు కుట్ర పన్నినట్లుగా వార్తలు రావడం కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలోని రామ్‌నగర‌లో ఎన్ఐఏ బృందం జరిపిన దాడుల్లో జేఎంబీ ఉగ్రవాది మునీర్‌ను అరెస్ట్ చేశారు.. విచారణలో అతడు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను తెలిపాడు. వాటిలో దలైలామా హత్య కూడా ఒకటి.

దలైలామా తరచుగా మైసూరు సమీపంలోని బైలుకుప్పె టిబెటన్ పునరావాస కేంద్రానికి వస్తుంటారు. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఆయన్ను హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా మునీర్ వివరించాడు. దలైలామాను హత్య చేయడం ద్వారా భారత్ సహా పలు దేశాల్లో హింసను లేపాలన్నది ఉగ్రవాదుల పన్నాగం..

అంతకు ముందే 2018 జనవరి 18న బిహార్‌లోని బుద్ధగయలో దలైలామా, బిహార్ గవర్నర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మునీర్ తెలిపారు. అయితే ఎన్ఐఏ అత్యంత చాకచక్యంగా బాంబులు పెట్టబోతున్న వ్యక్తులను అరెస్ట్ చేయడంతో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది.

బంగ్లాదేశ్‌కు చెందిన మునీర్ అక్కడ పలు బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు. బంగ్లాదేశ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తుండటంతో భారత్‌లోకి అక్రమంగా చొరబడి బట్టల వ్యాపారిగా మారి బెంగళూరు, రామ్‌నగర ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.. ఇతని వ్యవహారాలపై నిఘా పెట్టిన ఎన్ఐఏ పక్కా సమాచారంతో ఆగస్టు 7న రామ్‌నగరలో అదుపులోకి తీసుకుంది.