లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సారస్వత్‌‌కు బెదిరింపు లేఖ వచ్చింది. మూసేవాలకు పట్టిన గతే నీకు.. నీ కుటుంబంలోని అందరికీ పడుతుందని బెదిరించారు. జోధ్‌పూర్‌ హైకోర్టులో కృష్ణజింక వేట కేసులో సల్మాన్ ఖాన్ తరఫున సారస్వత్ వాదిస్తున్నారు.

న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్.. ఆయన గ్యాంగ్‌కే చెందిన గోల్డీ బ్రార్ పేర్లు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చాయి. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ తరఫున జోద్‌పూర్ హైకోర్టులో న్యాయవాది హస్తిమల్ సారస్వత్ వాదిస్తున్నారు. తాజాగా.. శత్రువు ఫ్రెండ్ కూడా శత్రువేనని పేర్కొంటూ ఓ బెదిరింపు లేఖ ఆ న్యాయవాది సారస్వత్‌కు వచ్చింది. సిద్దూ మూసేవాలాకు పట్టిన నీకు పడుతుందని, నీకే కాదు.. నీ కుటుంబ సభ్యులందరికీ అదే గతి పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు.

సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సారస్తవ్ చాంబర్ ఎదుట ఆ లేఖ కనిపించింది. ఆ లేఖలో నీకు కచ్చితంగా సిద్దూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుందని వార్నింగ్ ఉన్నది. తమ శత్రువుకు మిత్రుడు కూడా తమకు శత్రువేనని అందులో పేర్కొన్నారు. ఎవరినీ తాము వదిలి పెట్టబోమని, కుటుంబ సభ్యుల్లో ఎవరినీ విడిచిపెట్టబోమని బెదిరించారు. మూసేవాలాకు పట్టిన గతే నీకు కూడా అతి త్వరలోనే పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ బెదిరింపు లారెన్స్ బిష్ణోయ్.. గోల్డీ బ్రార్‌ల నుంచి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఆ బెదిరింపు లేఖలో చివరన ఎల్‌బీ, జీబీ అని క్యాపిటల్ లెటర్స్‌లో రాశారు.

ఈ విషయం తెలియగానే పోలీసులు న్యాయవాది హస్తిమల్ సారస్వత్‌కు సెక్యూరిటీ పెంచారు. అంతేకాదు, ఈ ఘటనపై దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. కృష్ణ జింక వేట కేసులో సల్మాన్ ఖాన్ తరఫున జోధ్‌పూర్ హైకోర్టులో హస్తిమల్ సారస్వత్ వాదిస్తున్నారు. 

గతంలో సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి కుట్ర చేసినట్టుగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఒప్పుకున్నాడు. 2021లో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ విషయాన్ని అంగీకరించాడు. 

ఈ ఏడాది జూన్ 5వ తేదీన ఇలాంటి ఓ బెదిరింపు లేఖ సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు కూడా వచ్చింది. ముంబయి బాంద్రా బ్యాండ్‌స్టాండ్ ప్రొమనేడ్‌లో జాగింగ్‌కు వెళ్లిన సలీమ్ ఖాన్‌కు ఈ లేఖ కనిపించింది.