ఇంటికి పంపించండి: బాంద్రా రైల్వేస్టేషన్ ముందు వేలాది కూలీల ఆందోళన, లాఠీఛార్జీ
ఈ నేపథ్యం ముంబై బాంద్రా రైల్వేస్టేషన్ బయట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్, బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు తాము స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ రోడ్లపైకి వచ్చి, గుమిగూడి ఆందోళన నిర్వహించారు.
సమాచారం అందుకున్న పోలీసులు భారీగా చేరుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయినప్పటికీ కార్మికులు వారి వాదన వినిపించుకోకపోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు.
అసలే మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వలస కార్మికుల చర్యపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ విషయంపై మహారాష్ట్ర హోంమంత్రి స్పందిస్తూ.. విపత్కర పరిస్ధితుల్లో కూలీలు ఇలా భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడం మంచిది కాదని హితవు పలికారు.
అదే సమయంలో వలస కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందని, వారు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే తాము మాత్రం వారిని నిలువరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు.
వలస కార్మికుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. కూలీల సమస్యపై కేంద్రం దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు.