కరోనా మహమ్మారి కేసులు ఇప్పటికీ నమోదౌతూనే ఉన్నాయి. కేసులు పెరుగుతున్నా.. జనాలు భయం లేకుండా తిరిగేస్తున్నారు. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్వేచ్ఛగా విహరిస్తున్నారు. కొందరైతే కనీసం మాస్క్ లు కూడ ధరించడం లేదు. కాగా.. ఈ నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది.

చెన్నైలోని మెరీనా తీరానికి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, లేకుంటే రూ.200ల జరిమానా విధిస్తామని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ హెచ్చరించింది. కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో అన్నిరకాల పర్యాటక ప్రాంతాలు ప్రారంభమైనా, కరోనా వ్యాప్తి చెందే అవకాశ ముందని మెరీనా బీచ్‌కు సందర్శకులను అనుమతించలేదు. 

మద్రాసు హైకోర్టులో మెరీనా దుకాణాలు, చేపల మార్కెట్‌కు సంబంధించి కేసు విచారణలో, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు గత నెల నుంచి మెరీనా తీరానికి సందర్శకులను అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై జీసీసీ ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు నిబంధనలు పాటించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ ఇంకా రాలేదనే విషయాన్ని గుర్తించి, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు మాత్రమే మాస్క్‌ ధరిస్తున్నారని, ప్రజలు, దుకాణ సిబ్బంది నిబంధనలు పాటించడం లేదన్నారు. మెరీనా బీచ్‌లో వాకింగ్‌ చేసేవారు, సందర్శకులు తప్పకుండా మాస్కు ధరించాలని కోరారు. నిబంధనలు సక్రమంగా పాటించేలా ప్రత్యేక బృందాలు బీచ్‌లో తనిఖీ చేసి మాస్కు ధరించని వారి నుంచి తలా రూ.200 జరిమానా వసూలుచేస్తారని ఆయన హెచ్చరించారు.