1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని బీజేపీ నాయకులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పౌరులు గొంతు నొక్కిందని ఆరోపించారు.
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ భారతదేశంలో విధించి నేటికి 46 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నాటి రోజులను గుర్తు చేసుకుంటూ బీజేపీ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడింది. అవి భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని అభివర్ణించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. ఎమర్జెన్సీ చీకటి రోజులలో భారత ప్రజాస్వామ్య సంస్థలను కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా, క్రమబద్ధంగా విధ్వంసం చేసిన తీరు ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు పోరాడిన గొప్ప వీరులను ఈరోజు మనం స్మరించుకుంటున్నామని ఆయన తెలిపారు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ భారతదేశంలో ప్రజాస్వామ్యం భయానక రోజులను, చీకటి రోజులను గుర్తుచేస్తోందని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ నిరంతరం ఏడ్చే వారు ఒక సారి చరిత్ర పుటలను తిరగేయాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
జూన్ 25వ తేదీన భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా గుర్తుండిపోతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. 1975లో ఇదే రోజున నిరంకుశ, అభద్రత, అధికార దాహంతో కూడిన పాలకులు పౌర హక్కులను తగ్గించి, ప్రజాస్వామ్య వ్యవస్థలను, న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే భారత ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్ డే అని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ‘‘ 47 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 25 జూన్ 1975 ప్రధాని ఇందిరా గాంధీ అంతర్గత ఎమర్జెన్సీని ప్రకటించారు. అన్ని ప్రాథమిక హక్కులను నిలిపివేశారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయాలని ఆదేశించారు. పత్రికా స్వేచ్ఛను తగ్గించారు ’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘‘ 1975లో ఈ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కులను లాక్కుంది. ఎమర్జెన్సీ విధించింది. కనికరం లేకుండా విదేశీ పాలనను అమలు చేసింది. ఈ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన దేశభక్తులందరికీ వందనాలు. ’’ అని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. ‘‘ 1975 సంవత్సరంలో ఇదే రోజున కాంగ్రెస్ కుటుంబ సంస్థ దేశంపై ఎమర్జెన్సీ విధించింది. భారతదేశం అద్భుతమైన ప్రజాస్వామ్య గొంతు నొక్కడానికి దురుద్దేశపూర్వక ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ నాటి దారుణ హింసలను భరిస్తూ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడుతున్న ప్రజాస్వామ్య యోధులందరికీ వందనం. జై హింద్! ’’ అంటూ ట్వీట్ చేశారు.
1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది మార్చి 21 1977 వరకు అంటే సుమారు 21 నెలల అమలులో ఉంది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం అంతర్గత అవాంతరాల కారణంగా రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ ఎమర్జెన్సీరని ప్రకటించారు. ఈ సమయంలో రాజ్యాంగం కింద పౌరులకు లభించిన ప్రాథమిక హక్కులన్నీ నిలిచిపోయాయి. మీడియాను నియంత్రించారు. ప్రతిపక్ష నాయకులు ఎందరో అరెస్టుకు గురయ్యారు. అనేక మంది బీజేపీ నాయకులు జైలు పాలయ్యారు. అందుకే ఈ కాలాన్ని ఆ పార్టీ బ్లాక్ డే స్ గా పరిగణిస్తుంటుంది. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటారు.
