ఈ సారి వర్షపాతాలు తక్కువగానే ఉండొచ్చని ప్రైవేట్ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. గత నాలుగేళ్లుగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ సారి వర్షాలు తక్కువగా ఉంటాయని, ముఖ్యంగా ఉత్తరాది, మధ్య భారతంలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని స్కైమెంట్ తెలిపింది. 

న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షా కాలంలో వానలు తక్కువగానే ఉంటాయని ఓ ప్రైవేట్ వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెంట్ చెప్పింది. నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలు సాధారణం కంటే స్వల్పంగా కురుస్తాయని అంచనా వేసింది. నైరుతి రుతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్. ఈ నెలల మధ్య దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) వర్షపాతం 94 శాతం వరకు ఉంటుందని స్కైమెంట్ ఎండీ జతిన్ సింగ్ వివరించారు. ఎల్పీఏ 96 నుంచి 104 శాతం మధ్య రేంజ్‌ను సాధారణ వర్షపాతంగా లెక్కిస్తారు.

గత నాలుగేళ్లుగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇందుకు ట్రిపుల్ డిప్ లానినా కారణంగా ఉన్నది. అయితే, లానినా ముగిసింది. ఎల్‌నినో సంభవించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లానినా ఉంటే మనకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ, ఎల్‌నినోతో చాలా సార్లు స్వల్ప వర్షపాతాన్నే చూశాం. దీనితోపాటు మరికొన్ని కారణాలు కూడా జతచేరవచ్చు. 

Also Read: మండుతున్న ఎండ‌లు.. తెలంగాణ‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఉష్ణోగ్ర‌త‌లు

ప్రాంతాల వారీగా చూస్తే.. వర్షపాతం ఉత్తరాది, మధ్య భారతంలో స్వల్పంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్కైమెంట్ తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు చాలా తక్కువ కురిసే అవకాశం ఉన్నదని స్కైమెంట్ అంచనా వేసింది. కాగా, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో కొంచెం మెరుగ్గా అంటే.. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది.