కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. వైరస్‌కు చికిత్స లేకున్నా.. రోగుల్ని ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎందరో డాక్టర్లు ఆ మహమ్మారికి బలయ్యారు.

అయినప్పటికీ విధి నిర్వహణలో రాజీ పడేది లేదని వారు చెబుతున్నారు. అలాంటి వైద్యులకు ప్రపంచం జేజేలు పలుకుతోంది. కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకున్న వారు డాక్టర్లను దీవించి వెళుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కుమార్తె దిశా వైద్య విద్య చివరి సంవత్సరంలో ఉన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆమె కరోనా రోగులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని మన్‌సుఖ్ స్వయంగా ట్వీట్ చేశారు.

Also Read:వరుసగా ఆరో రోజు మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు: గత నెలతో పోలిస్తే రికార్డు మరణాలు

నువ్వు ఈ బాధ్యత నిర్వహిస్తుండగా చూడాలని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నా... ప్రస్తుత విపత్కర స్థితిలో నువ్వు ఓ ఇంటర్న్‌గా నీ బాధ్యత నిర్వహిస్తుండటం తనకు ఎంతో గర్వకారణం. నువ్వు చేసే సేవ దేశానికి ఎంతో అవసరం. ఈ క్రమంలో నిన్ను నువ్వు నిరూపించుకుంటావని నేను బలంగా నమ్ముతున్నాను.

నువ్వు మరింత ధృడంగా అవ్వాలి వారియర్!’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే సమయంలో పీపీఈ కిట్‌ ధరించిన తన కుమార్తె ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో.. నెటిజన్లు దిశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.