ప్రపంచం భవిష్యత్తు చూసే విధానంపై ఈ జీ20 సదస్సు చెరగని ముద్ర వేస్తుంది - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ప్రస్తుతం భారతదేశ అధ్యక్షత జరుగుతున్న జీ20 సమ్మిట్ వల్ల కచ్చితంగా ప్రపంచం భవిష్యత్తును చూసే విధానంపై చెరగని ముద్ర వేస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ జీ20 సదస్సు అత్యంత ప్రభావవంతమైనదని తెలిపారు.

భారత్ లో జరుగుతున్న జీ20 సదస్సు అత్యంత ప్రభావవంతమైనదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొనియాడారు. ఆదివారం ఆయన ‘ఎన్డీటీవీ’తో మాట్లాడారు. భారతదేశ అధ్యక్షతన జరుగుతున్న ఈ జీ20 సదస్సు ప్రపంచం భవిష్యత్తును చూసే విధానంపై చెరగని ముద్ర వేస్తుందని తెలిపారు. జీ-20 సదస్సులో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రభావవంతంగా జరిగే సదస్సుల్లో ఇదొకటి అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
శనివారం రాత్రి తాను జీ20 సదస్సుకు హాజరైన ఓ దేశ రాయబారితో ఉన్నానని అన్నారు. ‘‘నేను అనేక జీ20లను చూశానని అయితే ఇది కచ్చితంగా అతిపెద్ద, అత్యంత విస్తృతమైన, అత్యంత ప్రభావవంతమైనది’’ అని ఆయన అన్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఢిల్లీ డిక్లరేషన్ పై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏకాభిప్రాయం కుదరడం దేశ రాజధానిలో జరిగిన రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సు సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చంద్రశేఖర్ అన్నారు.
ప్రస్తుతం ఉన్న డిజిటల్ అంతరాలను పూడ్చడానికి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం పురోగతిని వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం వేగవంతమైన పరివర్తనలను ఎలా అనుమతిస్తుందో కూడా మంత్రి మాట్లాడారు, దీనిని ఢిల్లీ డిక్లరేషన్ లో కూడా ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం సగటు పౌరుల జీవితాల్లో నిజమైన పరివర్తన తీసుకురాగలదని అన్నారు.
ఢిల్లీ డిక్లరేషన్ లో పేర్కొన్న క్రిప్టో-అసెట్స్ గురించి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ రకమైన ఆవిష్కరణలపై గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలని భారతదేశం చాలా సంవత్సరాలుగా చెబుతోందని అన్నారు. క్రిప్టో కార్యకలాపాలకు వీలు కల్పించే ఉమ్మడి ఫ్రేమ్ వర్క్ ను రూపొందించేందుకు దేశాలు మరింత సహకరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.