ఓ వైపు పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కొరత ఉన్న సమయంలో హరియాణాలో కొందరు దొంగలు వింత దొంగతనానికి తెగబడ్డారు. కొందరు దుండగులు వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. 

జింద్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 1,710 కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా డోసుల్ని దుంగడులు చోరి చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో టీకా డోసులు లేని పరిస్థితి ఏర్పడింది. 

జాతీయ మీడియా కథనాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పీపీ సెంటర్ జనరల్ ఆస్పత్రిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరోనా టీకాల దొంగతనానికి పాల్పడ్డారు. 

మొత్తం 1,710 టీకా డోసుల్ని ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఇతర మందులు, నగదు ఉన్నప్పటికీ దుండగులు వాటిని కనీసం ముట్టుకోలేదు. కేవలం కరోనా వైరస్ టీకాలే లక్ష్యంగా చోరీ జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో సంబంధిత ఆస్పత్రి వర్గాలు వ్యాక్సిన్ నిల్వ చేసే ప్రదేశంలో సీసీ కెమెరాలుగానీ, లేదా గార్డుని గానీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.