మామూలుగా దొంగలు ఏం చేస్తారు.. తాము టార్గెట్ చేసిన ఇంటిని ఎట్టి పరిస్దితుల్లో దోచేస్తారు. ఇందుకోసం అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటారు, లేదంటే బయట కొనుగోలు చేస్తారు.

కానీ జైపూర్‌లో మాత్రం దొంగతనం కోసం ఓ ఇంటిని రూ.90 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. వినడానికి ఆశ్చర్యంగా వుంది కదా. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. 

వైశాలి నగర్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ సునీత్‌ సోని ఇంటిలో రెండు రోజుల క్రితం భారీ దొంగతనం జరిగింది. ఆయన ఇంట్లో ఓ పెట్టె నిండా ఉన్న వెండిని ఖాళీ చేశారు దొంగలు.

అయితే ఇంటి నిండా సీసీ కెమెరాలు.. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికి ఈ దొంగతనం ఎలా జరిగిందో సునీత్‌కి అర్థంకాలేదు. దాంతో ఓ సారి తన ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. 

ఈ క్రమంలో ఇంటి బేస్‌మెంట్‌లో ఆయనకు ఓ పెద్ద సొరంగం కనిపించింది. దాని గుండా నడుచుకుంటూ వెళ్తే తన ఎదురు ప్లాట్‌ వచ్చింది. దీనిని బట్టి కథ మొత్తం ఆయనికి అర్థమైపోయింది.

దీనిపై డాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం డాక్టర్‌ సునీత్ ఇంట్లో ఉన్న వెండిని కాజేయడం కోసమే దొంగలు ఆయన ఇంటికి ఎదురుగా ఉన్న ప్లాట్‌ని 90 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని తేలింది.

మూడు నెలల క్రితం ప్లాట్‌ కొనుగోలు చేసిన దొంగలు నాటి నుంచి సొరంగం తవ్వడం మొదలు పెట్టారని వెల్లడించారు. ఇక డాక్టర్‌ వద్ద ఉన్న వెండితో పాటు ఆయన గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ దొంగతనం ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.