కరోనా కల్లోల సమయంలో పీపీఈ కిట్లు దొరక ఇబ్బందులు పడుతుంటే... ఒక దొంగ ఏకంగా దొంగతనానికి ఈ పీపీఈ  కిట్లను  వాడాడు. ప్రభుత్వం జారీచేసిన కరోనా మార్గదర్శకాలను నిష్టగా పాటించాలనుకున్నాడో ఏమో... ఏకంగా అతి జాగ్రత్తతో డాక్టర్లు ధరించే పీపీఈ కిట్ నే ధరించి దొంగతనానికి వెళ్ళాడు. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర రాష్ట్రంలోని జాల్నా పట్టణంలో దొంగతనానికి వచ్చిన ఒక దొంగ పీపీఈ కిటిని ధరించి వచ్చాడు. ఆ దొంగ ఫోటోలు సీసీటీవీ ల్లో రికార్డు అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

దొంగతనానికి వెళ్లిన ఇంట్లో ఎవరికన్నా కరోనా ఉన్నప్పటికీ... తనకు మాత్రం రాకుండా దొంగ జాగ్రత్తపడ్డట్టుగా అర్థమవుతుంది. కేవలం అతనెవరో గుర్తుపట్టకుండా ఉండడం కోసమైతే ముఖం వరకు కనబడకుండా కప్పుకుంటే సరిపోయేది కదా అని అంటున్నారు. 

కరోనా విషయంలో ఆ దొంగ తీసుకున్న జాగ్రత్తలను చూసి అందరూ నివ్వెరపోతున్నారు. దొంగతనానికి పీపీఈ కిట్ ను ధరించాలనే ఆలోచన ఆ దొంగకు ఎలా వచ్చిందో అంటూ అందరూ తలలు బద్దలుకొట్టుకుంటున్నారు. 

ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతడి తెలివికి హ్యాట్సాఫ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాట్ ఆన్ ఐడియా సర్ జీ అంటూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు. 

ఇకపోతే... తెలంగాణలో కరోనా వైరస్ కేసుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఓ రోజు తక్కువ కేసులు వచ్చాయి అనుకునేలోపే మరో రోజు భారీగా కేసులు వెలుగు చూస్తుండటం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

తాజాగా మంగళవారం కొత్తగా 178 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటితో కలిపి తెలంగాణలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 3,920కి చేరింది. ఇవాళ వైరస్ కారణంగా ఆరుగురు మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 148కి చేరింది.

మంగళవారం ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే 143 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత రంగారెడ్డిలో 15, మేడ్చల్ 10, మహబూబ్‌నగర్, సంగారెడ్డిలలో రెండేసి కేసులు, జగిత్యాల, అసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,030 యాక్టివ్ కేసులు ఉండగా, 1,742 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.