ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. కనీసం తల్లి చనిపోయిందని తెలిసినా కూడా అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. ఊరుకాని ఊరులో తమవారి అంత్యక్రియలు జరుగుతున్నా.. కనీసం చివరి చూపు కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు  అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.  5 రాష్ట్రాల మీదుగా 84 గంటల పాటు 3వేల  కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసి మృతదేహాన్ని అతడి ఇంటికి చేర్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మిజోరాం రాష్ట్రానికి చెందిన వివియన్ అనే వ్యక్తి హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్నాడు. ఇందుకోసం మిజోరాం నుంచి 2015లో తమిళనాడు రాజధాని చెన్నై  వెళ్లాడు. అయితే వివియన్ గుండెపోటుతో అకాల మరణం చెందాడు. అయితే అతడికి చెన్నైలో బంధువులు లేరు. 

తల్లిదండ్రులు, బంధువులు అంతా  మిజోరాం రాష్ట్రంలోనే ఉన్నారు. లాక్ డౌన్ కావడంతో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. దీనిపై చెన్నైలో ఉన్న మిజోరాం వెల్ఫేర్  అసోసియేషన్ స్పందించింది. మృతదేహాన్ని స్వస్థలమైన మిజోరాం పంపేందుకు ఏర్పాట్లు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం అంబులెన్స్  మాట్లాడింది. ఇద్దరు డ్రైవర్లు అంబులెన్స్ నడిపేందుకు ముందుకు వచ్చారు. 

వారికి తోడు వివియన్ స్నేహితుడు కూడా ముందుకు వచ్చాడు. 5 రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్,  మేఘాలయ, అసోం మీదుగా చివరకు మిజోరాం చేరుకున్నారు. మొత్తం 84 గంటల పాటు 3వేల 345 కిలోమీటర్లు ప్రయాణం సాగింది. చెన్నై టు ఐజ్వాల్  వరకు ప్రయాణం సాగింది. చివరికి వివియన్ ఇంటికి మృతదేహం చేరింది. మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

అంబులెన్స్ ను ఇద్దరు డ్రైవర్లు నడిపారు. జయేంద్రన్(41), చిన్నతంబి(51). వారిద్దరూ చాలా సుదీర్ఘంగా అంబులెన్స్ నడిపారు. ప్రయాణం మధ్యలో  ఆహారం, ఇంధనం కోసం మాత్రమే వాహనం ఆపడం గమనార్హం. దీంతో వీరు చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.