మా ఫోన్లు హ్యాక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు..ఆపిల్ నుంచి థ్రెట్ నోటిఫికేషన్ వచ్చింది : ప్రతిపక్ష నాయకుల ఆరోపణ
తమ ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఆపిల్ నుంచి తమ ఫోన్లకు థ్రెట్ నోటిఫికేషన్ వచ్చిందని పేర్కొన్నారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని తెలిపారు. అయితే దీనిని బీజేపీ ఖండించింది. ఆపిల్ నుంచి వివరణ వచ్చే వరకు ఎదురు చూడాలని సూచించింది.
తమ ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంలో తమకు ఆపిల్ నుంచి తమ ఐఫోన్లకు థ్రెట్ నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. తమ ఫోన్లపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
యాపిల్ నుంచి థ్రెట్ నోటిఫికేషన్ వచ్చిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, శశి థరూర్, ఐఎంఐ అదినేత అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంలోని ఇతరులకు కూడా ఆపిల్ నుంచి తమ ఫోన్లు, ఇమెయిల్స్ కు ఆపిల్ నుంచి సందేశాలు వచ్చాయని వెల్లడించారు.
ఇందులో పలువురు నాయకులు ఫోన్లకు వచ్చిన నోటిఫికేన్లు, ఈ-మెయిల్ సందేశాల స్క్రీన్ షాట్లను ‘‘ఎక్స్’’(ట్విట్టర్)లో ట్విటర్ లో షేర్ చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ పోస్టులో ‘‘హ్యాకర్లు నా ఫోన్ ను టార్గెట్ చేస్తున్నారని నిన్న రాత్రి ఆపిల్ బెదిరింపు నోటిఫికేషన్ వచ్చింది. ’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా ఆపిల్ నుంచి ఇలాంటి సందేశాన్ని అందుకున్నట్లు తెలిపారు. ‘‘నేను థ్రెట్ నోటిఫికేషన్.కామ్ నుంచి ఆపిల్ ఐడీ నుంచి పొందాను. పన్ను చెల్లింపుదారుడిగా నా ఖర్చుతో పనికిమాలిన అధికారులను బిజీగా ఉంచడం సంతోషంగా ఉంది! ఇంతకుమించి చేసేదేమీ లేదు..’%’ అని శశిథరూర్ ఎక్స్ లో వ్యాఖ్యానించారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా దీనిపై వ్యాఖ్యానిస్తూ.. ‘‘ఈ రోజు ఉదయం ఆపిల్ నుంచి నాకు ఆందోళనకరమైన నోటిఫికేషన్ వచ్చింది, నా ఫోన్ పై ప్రభుత్వ ప్రాయోజిత స్పైవేర్ దాడి జరిగే అవకాశం ఉందని నన్ను అప్రమత్తం చేసింది.’’ అని పేర్కొన్నారు.
అయితే ఇందులో బీజేపీ ప్రమేయం ఉందని ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. ఈ చర్యలతో తమ పార్టీ ప్రమేయమేమీ లేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వ ప్రాయోజిత దాడిపై సాధారణ అనుమానితుల దుమ్మెత్తిపోయడం మంచిదే కానీ, గతంలో మాదిరిగానే ఈ హల్ చల్ అంతా తడిసి ముద్దయ్యే అవకాశం ఉంది! ఆపిల్ వివరణ ఇచ్చే వరకు ఎందుకు వేచి ఉండకూడదు?’’ అని ట్వీట్ చేశారు.