గుర్రాల పందేనికి గాడిద తెస్తున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పై అనర్హత వేటు, ప్రెస్ మీట్, కాంగ్రెస్ నిరసనలపై ఘాటుగా స్పందించారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై విమర్శలు సంధించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అనంతరం, కాంగ్రెస్ నిరసనలు, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ వంటి అంశాలపై ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎలాంటి రాజకీయాలు అవసరం, న్యాయ వ్యవస్థ ఏమిటీ? నాయకత్వం ఇత్యాది అంశాలపై ఆ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైనే పరువు నష్టం దావా పడిందని, దానిలో ఆయనకు శిక్ష పడిందని, ఇది కోర్టు వ్యవహారం అని అన్నారు. శిక్ష పడినందుకు కాంగ్రెస్ గగ్గోలు పెడుతున్నదని తెలిపారు. కోర్టులు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వారు నిరసనలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అది కోర్టు వ్యవహారం, వారేమైనా పోరాడేది ఉంటే అది కోర్టులో పోరాడాలని సూచించారు.
రాహుల్ గాంధీ ప్రెస్ మీట్‌ను ప్రస్తావిస్తూ ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరువు నష్టం కేసులో దోషిగా తేలినందుకు ఆయన మహాభారత్, సావర్కర్‌లను ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. సావర్కర్ గురించి మాట్లాడుతున్నారని, ఆయన ఈ దేశానికి ఏం చేశారో తెలుసా? అని అడిగారు. గుర్రాల పందేనికి గాడిదను తెచ్చినట్టు ఉన్నది అంటూ ఇదే తన స్టేట్‌మెంట్ అని అన్నారు.
Also Read: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై రెండో రోజుకు కాంగ్రెస్ నిరసనలు.. టాప్ పాయింట్స్
కోర్టు ఆయనను దోషిగా తేల్చి శిక్ష విధించిన తర్వాత దాని ఫలితంగా జరగాల్సిన పరిణామాలు జరిగాయని, అందుకే ఆయనపై అనర్హత వేటు పడిందని అన్నారు.
ఈ రోజు రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఈ నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
