ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడం అందరికీ ఇష్టమే అని, దీనిపై ఎవరూ వ్యతిరేకంగా లేరని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన కచ్చితమైన సూచనలతో ముందుకు వచ్చారని తెలిపారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం పట్ల పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. పీకే పార్టీ ముఖ్య నాయకులకు ఇచ్చిన ప్రజెంటేషన్ ఆకట్టుకునేలా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శుక్రవారం ఎన్డీటీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ క్షీణత, పార్టీ పునరుద్ధరణ కోసం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన విశ్లేషణ ఆకట్టుకునేలా ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ‘‘ అతను గణాంకాల వ్యక్తి. చాలా కొత్తది ఏమీ లేదు. మనకు తెలియనిది ఏమీ లేదు. అతని సూచనలకు ఎలాంటి ప్రతిఘటనా లేదు. మీరు ఒక సమస్యను ఎలా ప్రస్తావిస్తారు, పార్టీ ఆ సమస్యలను ఎలా ఎంచుకుంటుంది అనేది ఒక్కటే ప్రశ్న.’’ అని ఆయన అన్నారు.
ప్రశాంత్ కిషోర్‌కు పార్టీ పదవి ఇవ్వాలనే కోరుకునే వారిలో దిగ్విజయ్ సింగ్ ఒకరు. ‘‘ అతనితో నాకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది. నేను అతనితో చాలా దగ్గరగా మాట్లాడాను. ఆయన రాజకీయ విశ్లేషకుడు. అతడి ప్రయాణం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి సాగింది. ఆయనకు ఎలాంటి రాజకీయ నిబద్ధతా లేదా సైద్ధాంతిక నిబద్ధతా లేదు. అయితే ఇప్పుడు ఆయన చాలా ఖచ్చితమైన సూచనలతో ముందుకు వచ్చాడు. ఆయన చేసిన ప్రదర్శన చాలా బాగుంది ” అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
దిగ్విజయ్ సింగ్ మాటలతో పీకే కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయం అయినట్టుగానే తెలుస్లోంది. చాలా ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో సోనియా గాంధీ కుటుంబానికి, ఆయనకు పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే అవి విఫలమయ్యాయి. కాగా ఈ నెల 17వ తేదీన మరో సారి సోనియా గాంధీ కుటుంబంతో, అలాగే పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. 2024 ఎన్నికల కోసం ఆచరించాల్సిన బ్లూ ప్రింట్‌ను ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర, దాని స్థితి గురించి వివరించారు. ఈ బ్లూ ప్రింట్ ప్రకటించడానికి ముందు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో మరణించడానికి వీల్లేదని, దేశంతోపాటు అదీ ఉండాలని పేర్కొన్నారు.
ప్రశాంత్ కిశోర్ తన బ్లూ ప్రింట్‌లో దేశ జనాభా, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, రైతుల పట్ల పార్టీ వైఖరిని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, 2024 జనరల్ ఎలక్షన్స్‌లో ఓటు వేయడానికి సిద్ధం అవుతున్న 13 కోట్ల తొలిసారి ఓటేసి నవయువకులనూ ఫోకస్ చేశారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం లోక్‌సభ, రా జ్యసభలో కలిపి కేవలం 90 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 800 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదని, మరో మూడు రాష్ట్రాల్లో పొత్తులతో అధికారంలో ఉన్నదని తెలిపారు. 13 రాష్ట్రాల్లో ఇది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నదని పేర్కొన్నారు. 1984 నుంచి కాంగ్రెస్ ఓటు శాతం క్రమంగా క్షీణిస్తూ వస్తున్నదని వివరించారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన వ్యూహాలను ఆయన తెలియజేశారు.
