అమెరికా, భారతదేశ నాయకుల మధ్య ‘‘అపూర్వమైన నమ్మకం ఉంది’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘భారతదేశం చాలా ఉన్నతమైన, లోతైన, విస్తృత ప్రొఫైల్, పాత్రకు అర్హమైనది’’ అని చెప్పారు.
అమెరికా, భారతదేశ నాయకుల మధ్య ‘‘అపూర్వమైన నమ్మకం ఉంది’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ల మధ్య సంబంధాలు అపూర్వమైన బలం, లోతుకు చేరుకున్నాయని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచ వేదికపై, ప్రత్యేకించి గణనీయమైన భౌగోళిక రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో భారతదేశం తన సరైన స్థానాన్ని పొందేందుకు కృషి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు అంశాలను పంచుకున్నారు.
తన అమెరికా పర్యటన.. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ‘‘మా భాగస్వామ్యానికి ఒక ముఖ్యమైన స్తంభం’’ అని మోదీ ప్రశంసించారు. ఇది వాణిజ్యం, సాంకేతికత శక్తికి విస్తరించిందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ కార్యాలయంలో దాదాపు గంటసేపు పాటు ఈ ఇంటర్వ్యూ సాగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో భారత విదేశాంగ విధానం గురించి, మరింత ఆధునికమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దేశ ప్రయత్నాలు, ఇతర అంశాల గురించి మాట్లాడినట్టుగా తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో పసుపు కుర్తా, లేత గోధమ రంగు జాకెట్ ధరించి మోదీ పాల్గొన్నట్టుగా పేర్కొంది.
‘‘భారతదేశం చాలా ఉన్నతమైన, లోతైన, విస్తృత ప్రొఫైల్, పాత్రకు అర్హమైనది’’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలను పెరుగుతున్న బహుళ ధృవ ప్రపంచ క్రమానికి అనుగుణంగా మార్చడానికి, వాతావరణ మార్పుల పరిణామాల నుంచి రుణ తగ్గింపు వరకు ప్రపంచంలోని తక్కువ-సంపన్న దేశాలకు, వారి ప్రాధాన్యతలకు మరింత విస్తృతంగా ప్రాతినిధ్యం వహించడానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
‘‘వేలాది సంవత్సరాలుగా భారతదేశం.. అన్ని మతాలు, విశ్వాసాల ప్రజలు శాంతియుతంగా, అభివృద్ధి చెందడానికి స్వేచ్ఛను కనుగొన్న భూమి’’ అని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘ప్రపంచంలోని అన్ని విశ్వాసాల ప్రజలు భారతదేశంలో సామరస్యంగా జీవిస్తున్నారని మీరు కనుగొంటారు’’ అని కూడా తెలిపారు.
భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ తన కథనంలో ప్రస్తావించింది. ‘‘భారత్ ఏ దేశాన్ని భర్తీ చేస్తున్నట్లు మేము చూడలేమని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో భారత్ తన సముచిత స్థానాన్ని పొందుతున్నట్లుగా ఈ ప్రక్రియను చూస్తున్నాం. ఈ రోజు ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి, పరస్పర ఆధారితమైనది. స్థితిస్థాపకతను సృష్టించడానికి, సరఫరా గొలుసులలో మరింత వైవిధ్యం ఉండాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
చైనాతో సరిహద్దు సమస్యల గురించి మోదీ మాట్లాడుతూ.. ‘‘చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల కోసం.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత అవసరం’’ అని అన్నారు. ‘‘సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, చట్ట నియమాలను పాటించడం, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో మాకు ప్రధాన నమ్మకం ఉంది. అదే సమయంలో భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అందుకు కట్టుబడి ఉంది’’ అని మోదీ స్పష్టం చేశారు.
‘‘భారతదేశం స్థానం మొత్తం ప్రపంచంలో బాగా తెలుసు. బాగా అర్థం చేసుకోబడిందని నేను భావిస్తున్నాను. భారతదేశం అత్యంత ప్రాధాన్యత శాంతి అని ప్రపంచానికి పూర్తి విశ్వాసం ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు.
Also Read: అమెరికా, ఈజిప్ట్ దేశాల 5 రోజుల పర్యటన కోసం బయలుదేరిన మోదీ.. ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..
ఉక్రెయిన్ వివాదం విషయానికి వస్తే.. ‘‘కొందరు మేము తటస్థంగా ఉన్నామని చెప్పారు. కానీ మేము తటస్థంగా లేము. మేం శాంతి పక్షాన ఉన్నాం’’ అని మోదీ స్పష్టం చేశారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని మోదీ అభిప్రాయపడ్డారు. వివాదాలు యుద్ధంతో కాకుండా దౌత్యం, చర్చలతో పరిష్కరించబడాలని అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీలతో తాను చాలాసార్లు వేర్వేరుగా మాట్లాడానని చెప్పారు. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ సమ్మిట్ సందర్భంగా తాను ఇటీవల జెలెన్స్‌కీతో మాట్లాడానని చెప్పారు. భారతదేశం చేయగలిగినదంతా చేస్తుందని చెప్పారు. ‘‘వివాదాన్ని అంతం చేయడానికి, శాశ్వతమైన శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అన్ని నిజమైన ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది’’ అని మోదీ తెలిపారు.
ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌లు, విస్తరణవాదం వంటి ప్రపంచంలోని అనేక సమస్యలను మోదీ ముడిపెట్టారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సృష్టించబడిన ప్రపంచ సంస్థల వైఫల్యానికి అనుగుణంగా.. చిన్న, ప్రాంతీయ సమూహాలు శూన్యంలో ఉద్భవించాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థలు మారాలని ఆయన అన్నారు. ‘‘ముఖ్యమైన సంస్థల సభ్యత్వాన్ని చూడండి.. ఇది నిజంగా ప్రజాస్వామ్య విలువల స్వరాన్ని సూచిస్తుందా?’’ అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షక కార్యకలాపాలకు సైనిక దళాల సహకారిగా భారతదేశం పాత్రను సూచిస్తూ.. ఐకరాజ్య సమితి భద్రతా మండలిలో చేరాలనే భారతదేశం కోరికను మోదీ సూచించారు. కౌన్సిల్ ప్రస్తుత సభ్యత్వం మూల్యాంకనం జరగాలని అన్నారు. భారతదేశం అక్కడ ఉండాలనుకుంటున్నారా? అని ప్రపంచాన్ని అడగాలని చెప్పారు.
స్వేచ్ఛా భారతదేశంలో పుట్టిన తొలి ప్రధానిని నేనే అని మోదీ అన్నారు. ‘‘అందుకే నా ఆలోచనా విధానం, నా ప్రవర్తన, నేను చెప్పేది, చేసేది నా దేశం యొక్క లక్షణాలు, సంప్రదాయాలచే ప్రేరణ పొందింది. అలాగే ప్రభావితం చేయబడింది. నేను దాని నుండి నా బలాన్ని పొందుతున్నాను. నేను నా దేశాన్ని ప్రపంచానికి నా దేశంగా. నన్ను నేనుగా ప్రదర్శిస్తాను’’ అని మోదీ పేర్కొన్నారు.
