బీజేపీలోనూ సమన్వయ లోపం కనిపిస్తోంది - విపక్షాలపై మోడీ వ్యాఖ్యలు, అమిత్ షా లేఖను పోలుస్తూ ఖర్గే కామెంట్స్..
మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష కూటమిపై విమర్శలు చేస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు, అదే రోజు విపక్ష సభ్యులకు అమిత్ షా రాసిన లేఖలను ఆయన పోలుస్తూ.. కేంద్రంలోని అధికారి పార్టీలోనూ సమన్వయం లోపించిందని విమర్శించారు.

కొన్నేళ్లుగా అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని, కానీ ఇప్పుడు అధికార పార్టీలోనూ ఈ అగాధం కనిపిస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. విపక్షాలపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఘాటైన వ్యాఖ్యలు, అదే రోజు విపక్ష సభ్యులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాసిన లేఖలను పోలుస్తూ కాంగ్రెస్ చీఫ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రంలో అశాంతిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని, దీనిపై సభలో చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ఆయన పునరుద్ఘాటించారు.
కొందరు ప్రతిపక్ష నేతలకు అమిత్ షా రాసిన లేఖ ప్రభుత్వ 'కత్తి' (మాటలు), 'కర్ణి' (చర్యలు) మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుందని ఖర్గే అన్నారు. ‘‘ఒక రోజు గౌరవనీయులైన ప్రధాని దేశంలోని ప్రతిపక్ష పార్టీలను బ్రిటిష్ పాలకులు, ఉగ్రవాద సంస్థతో పోలుస్తారు. అదే రోజు హోంమంత్రి భావోద్వేగ లేఖ రాస్తారు. అందులో ప్రతిపక్షాల నుంచి సానుకూల వైఖరిని ఆశిస్తారు. కొన్నేళ్లుగా అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఈ అగాధం కనిపిస్తోంది’’ అని అన్నారు.
‘‘ఈ విషయంలో ప్రధాని ప్రతిపక్షాలను దిక్కుతోచన విధంగా అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం మాత్రమే కాదు దురదృష్టకరం కూడా. మణిపూర్ పై సభకు వచ్చి ప్రకటన చేయాలని ప్రధానిని కోరుతున్నాం, కానీ అలా చేయడం ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఉంది.’’ అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ దేశ ప్రజల పట్ల తమకు నిబద్ధత ఉందని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు.
సుప్రీంకోర్టు కలుగజేసుకునే దాకా మౌనంగా ఉన్న ప్రధానిపై ‘ఇండియా’కు ఎలా నమ్మకం ఉంటుంది - కపిల్ సిబల్
మణిపూర్ సమస్యపై పార్లమెంటులో చర్చించేందుకు అమూల్యమైన సహకారం అందించాలని కోరుతూ అమిత్ షా మంగళవారం ప్రతిపక్ష నేతలు ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలకు లేఖ రాశారు. అందులో మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ ముఖ్యమైన సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కాగా.. అంతకు ముందు కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (ఇండియా)పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈస్టిండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి పేర్లను ఉదహరించారు. దేశం పేరును ఉపయోగించినంత మాత్రాన ప్రజలను తప్పుదోవ పట్టించలేమని అన్నారు.