ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో.. ఇప్పుడు బిహార్‌లో అదే పునరావృతం అవుతుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆదివారం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు .

బిహార్‌లో డబుల్ ఇంజిన్స్ సామర్థ్యంలో పనిచేసే ప్రభుత్వం ఉందని.. మరోవైపు మాత్రం ఇద్దరు, ఇద్దరు యువరాజులు ఉన్నారని అన్నారు. యూపీలో ఇద్దరు యువరాజులు బీజేపీని ఓడించాలని చూశారని.. కానీ ప్రజలు వారిని ఇంటికే పరిమితం చేశారని చెప్పారు.

బిహార్‌లో కూడా ఇద్దరు యువరాజులు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారని అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లను పరోక్షంగా విమర్శించారు. మేము బిహార్ అభివృద్దికి కట్టుబడి ఉంటే.. వారు కోల్పోయిన సింహాసనాలను దక్కించుకోవాలని చూస్తున్నారు. బిహార్‌కు జంగిల్ రాజు వద్దు.. వికాస్ రాజ్ కావాలని ప్రధాని చెప్పారు.

ఈ ర్యాలీకి వచ్చిన జనాన్ని చూస్తే బిహార్ ఎన్నికల ఫలితాలు ఏమిటో నాకు తెలిసిపోయిందని జోస్యం చెప్పారు. గతంలో బిహార్‌ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఇంత మంది జనాన్ని చూడలేదని... ఇది అద్భుతమైన దృశ్యమని అలాగే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

ఇక, కొద్ది రోజుల కిందట బిహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. తేజస్వీ యాదవ్‌నుద్దేశించి జంగిల్‌ రాజ్‌ కా యువరాజ్‌ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు మోడీ తనను జంగిల్ రాజు కా యువరాజు అనడంపై తేజస్వీ యాదవ్ స్పందించడానికి ఇష్టపడని సంగతి తెలిసిందే.

మోడీ దేశ ప్రధాని అని ఆయన ఏదైనా చెప్పగలరని.. అలాంటి వాటిపై స్పందించడం తనకు ఇష్టం లేదని తేజస్వీ వ్యాఖ్యానించారు. ఈ రకంగా మాట్లాడటం ద్వారా మోడీ.. అవినీతి, ఉద్యోగాలు వలస సంక్షోభం వంటి నిజమైన సమస్యలను దాటవేస్తున్నారని ఆరోపించారు. కాగా, బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్, వామపక్షాలు మహా కూటమిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే