South Delhi: క్షుద్రపూజలు నిర్వహించిన తర్వాత.. ఇంట్లో దొంగతనం చేసింది పనిమనిషి అని చెప్పడంతో ఆమెను దారుణంగా కొట్టి.. వివస్త్రను చేసి ఓ గదిలో బంధించారు. అవమానం భరించలేని బాధితురాలు ఎలుకల మందు తాగింది.
South Delhi: కాలంలో పోటీ పడుతూ మనిషి అభివృద్దిలో దూసుకుపోతూ.. అంతరిక్షంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఇంకా సమాజంలో పెద్ద ఎత్తున మూఢనమ్మకాలు ప్రబలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మూఢనమ్మకాలతో ఓ కుటుంబం తన ఇంట్లో పనిచేసే మహిళ దొంగతనానికి పాల్పడిందని అత్యంత దారుణంగా ఆమెపై దాడి చేయడంతో పాటు అక్కడ ఉండే వారందరి ముందు వివస్త్రను చేసి గదిలో బంధించింది. ఈ అవమానం భరించలేని బాధితురాలు ఎలుకల మందు తాగిందని ఎన్డీటీవీ నివేదించింది. బాధితురాలు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
అత్యంత దారుణమైన ఈ ఘటన గురించి పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని ఓ కుటుంబం దొంగతనం జరిగిందనే అనుమానంతో ఇంటి పనిమనిషిపై దాడి చేసిన ఓ కుటుంబంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 10 నెలల క్రితం తమ ఇంటిలో దొంగతనం జరిగిందనీ, వైలువైన వస్తువులను దొంగిలించారని ఓ కుటుంబం క్షుద్ర మాంత్రికుడిని సంప్రదించింది. దొంగతనానికి పాల్పడిన వారి గురించి తెలుసుకోవాలని మాంత్రికుడిని కోరారు. ఈ క్రమంలోనే సదరు మాంత్రికుడు ఆ ఇంటికి చేరుకుని కొన్ని క్షుద్రపూజలు నిర్వహించాడు. తర్వాత ఇంట్లో పనిచేసే వారే ఈ దొంగతనానికి సహాయం చేశారని చెప్పాడు. దీంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ పనిమనిషిని ఆ కుటుంబ యజమాని క్రూరంగా దాడి చేయడంతో పాటు ఆమెను వివస్త్రను చేసి ఓ గదిలో బంధించారు.
బట్టలు విప్పించి.. గదిలో బంధించిన బాధితురాలి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 43 ఏళ్ల బాధితురాలు తన కుటుంబంతో కలిసి సత్బరిలోని అన్సల్ విల్లాస్లోని విలాసవంతమైన ఫాంహౌస్ లో ఇంటిపని సహాయకురాలిగా పనిచేస్తూ.. గత రెండు సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది. అయితే, దాదాపు 10 నెలల క్రితం ఇదే ఫామ్ హౌస్ లో దొంగతనం జరిగింది. ఆగస్టు 9 న ఆ ఇంటి మహిళా యజమాని ఒక క్షుద్ర మాంత్రికుడిని పిలిచింది. దొంగను కనిపెట్టాలని కోరింది. ఈ క్రమంలోనే పలు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ తర్వాత.. ఇంట్లో పనిచేసే సహాయకులందరికీ బియ్యం, సున్నం తినిపించమని నిందితులకు ఆ క్షుద్ర మాంత్రికుడు చెప్పాడు. అది తిన్న తరువాత నోరు ఎర్రగా మారిన వాళ్లు దొంగ అని చెప్పాడు.
క్షుద్రమాంత్రికుడు చెప్పినట్టుగా.. బియ్యం, సున్నం తిన్న తరువాత బాధితురాలి ముఖం ఎర్రబడింది. దీంతో దొంగతనం ఇంటి పనిమనిషి చేసిందని పేర్కొంటూ.. మహిళా యజమాని ఆమెను కొట్టడం ప్రారంభించింది. తీవ్రంగా ఆమెపై దాడి చేయడంతో పాటు ఆ ఇంట్లో పనిచేసే వారందరి ముందు బాధితురాలి బట్టలు విప్పి నగ్నంగా నిలబెట్టి దాడి చేసి.. ఓ గదిలో 24 గంటలకు పైగా బంధించింది. ఈ సమయంలోనూ పలుమార్లు బాధితురాలిని కొట్టారు. ఆగస్టు 10 సాయంత్రం బాధితురాలు గదిలో ఉన్న ఎలుక మందు తాగి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఈ అవమానం భరించలేకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాననీ, అందుకే ఎలుకల మందు తాగానని బాధితురాలు చెప్పింది. ఆగస్టు 11న ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
