చెన్నై: సినీ నటి గాయత్రి సాయినాథ్ నివాసంలో బంగారం చోరీ జరిగింది. ఆమె ఇంట్లోని 111 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో పనిచేస్తున్న నర్సు ఆ చోరీకి పాల్పడినట్లు గుర్తించి, పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

రాయపేటలోని లయిడ్స్ రోడ్డు విధీలో సినీ నటి గాయత్రి సాయినాథ్ తన తల్లితో పాటు నివాసం ఉంటోంది. వృద్ధురాలైన తన తల్లికి సేవలు చేయడానికి స్థానిక మైలాపూర్ లోని కబాలి తోటకు చెందన శివగామి అనే నర్సును ఏర్పాటు చేసుకుంది. 

ఇటీవల గాయత్రి సాయినాథ్ నివాసంలో 111 గ్రాముల బంగారం చోరీ జరిగింది. దానిపై గాయత్రి రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. 

గాయత్రి సాయినాథ్ నివాసంలో పనిచేస్తున్న నర్సు శివగామి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు శివగామి బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు పోలీసు విచారణలో బయటపడింది. పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని గాయత్రి సాయినాథ్ కు అప్పగించారు.