లైంగిక వేధింపులను ప్రతిఘటించిందని.. బాలికను కదులుతున్న ట్రైన్ ముందు తోసేసిన యువకులు.. కాళ్లు, చేయి తెగి..
లైంగిక వేధింపులను ప్రతిఘటించిందని బాలిక పట్ల ఇద్దరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెను కదులుతున్న ట్రైన్ ముందుకు తోసేశారు. దీంతో బాధితురాలి రెండు కాళ్లు, ఓ చేయి తెగిపోయింది. ఈ ఘటన యూపీలో జరిగింది.

ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై ఘోరాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్, కాలేజీకి వెళ్లే బాలికలు అని కూడా చూడకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వారిని ప్రతిఘటిస్తే దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే జరిగింది. లైంగిక వేధింపులకు అడ్డు చెప్పిందని బాలికను ట్రైన్ ముందుకు తోసేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగరంలోని ఓ కాలనీకి చెందిన 17 బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ప్రతీ రోజూ ఉదయం ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేది. అనంతరం ట్యూషన్ కు వెళ్తుండేది. అయితే ఈ సమయంలో ఇద్దరు యువకులు ఆమె వెంట పడేవారు. లైంగికంగా వేధింపులకు గురి చేసేవారు. ఈ విషయం బాలిక ఒక రోజు తండ్రికి చెప్పింది.
దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహించారు. దీనిపై విచారణ జరపలేదు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు ఓ యువకుడి ఇంటికి వెళ్లి, అతడి తీరుపై ఫిర్యాదు చేశారు. అయినా అతడిలో మార్పు రాలేదు. కాగా.. బాలిక ఎప్పటిలాగే మంగళవారం కాలేజీకి వెళ్లి వచ్చి, తరువాత ట్యూషన్ కు వెళ్లింది.
మళ్లీ ఓ యువకుడు, అతడి సహచరుడు కలిసి బాలికన వెంటపడ్డారు. సీబీ గంజ్ ప్రాంతంలో ఆమెను లైంగిక వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఖదౌ రైల్వే క్రాసింగ్ దగ్గరికి చేరుకున్నారు. చాలా సేపు ఆ యువకుల చేష్టలను భరించిన బాధితురాలికి సహనం నశించింది. దీంతో వారిపై తిరగబడింది. లైంగిక వేధింపులను ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తులైన యువకులు ఆ బాలికను కదులుతున్న రైలు ముందు తోసేశారు.
ట్రైన్ బాలికపై నుంచి వెళ్లిపోవడంతో బాధితురాలి మోకాళ్ల కిందటి భాగాలు తెగిపోయాయి. అలాగే ఓ చేయి కూడా తెగిపోయింది. స్థానికులు గమనించి బాలికను వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన పోలీసులకు సమాచారం అందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్, ఒక సబ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రభాన్ సస్పెండ్ చేశారు. అలాగే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
కాగా.. ఈ ఘటన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిగణనలోకి తీసుకున్నారని, బాలిక కుటుంబానికి రూ .5 లక్షల సహాయం అందిస్తామని బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మీడియాతో తెలపారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కాగా.. హాస్పిటల్ లో ఉన్న బాలికను ఉన్నతాధికారులు పరామర్శించి ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు.