పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి - సీడబ్ల్యూసీ డిమాండ్
రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం తెలిపాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. గతంలోనే ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని, దీనిని లోక్ సభలో ఆమోదించాలని కాంగ్రెస్ తొమ్మిదేళ్లుగా డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ నాయకులు జైరాం రమేష్ పేర్కొన్నారు.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ను కాంగ్రెస్ మరో సారి లేవనెత్తింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. పంచాయతీలు, నగరపాలికల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్ల కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1989 మేలో రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. కానీ అవి లోక్ సభలో ఆమోదం పొందాయని, రాజ్యసభలో విఫలమయ్యాయని తెలిపారు.
తరువాత పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో 1993 ఏప్రిల్ లో పంచాయతీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లులను తిరిగి ప్రవేశపెట్టారని తెలిపారు. రెండు బిల్లులు ఆమోదం పొంది చట్టంగా మారాయని తెలిపారు. దీని వల్ల ప్రస్తుతం పంచాయతీలు, నగర పాలక సంస్థల్లో 15 లక్షలకు పైగా మహిళా ప్రజాప్రతినిధులున్నారని పేర్కొన్నారు.
తరువాత పార్లమెంటు, రాష్ట్రాల చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ల కోసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారని జైరాం రమేష్ తెలిపారు. 2010 మార్చి 9న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినా లోక్ సభలో చర్చకు రాలేదని పేర్కొన్నారు.
‘‘రాజ్యసభలో ప్రవేశపెట్టిన, ఆమోదించిన బిల్లులు చెల్లవు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంది. ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు లోక్ సభలో కూడా ఆమోదం పొందాలని కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదేళ్లుగా డిమాండ్ చేస్తోంది’’ అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు.
కాగా.. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ‘‘సంవిధాన్ సభ నుంచి ప్రారంభమై 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణం - విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు' అనే అంశంపై 5 రోజుల ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ బులెటిన్ విడుదల చేసింది. అలాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలాన్ని నియంత్రించే బిల్లు సహా నాలుగు బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. అలాగే 2023 ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన 'ది అడ్వకేట్స్ (సవరణ) బిల్లు 2023', 'ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023' తదితర బిల్లులు చర్చకు రానున్నాయి.