స్నేహితుడి సాయంతో భర్తను హతమార్చిన భార్య.. దోషిగా తేల్చిన కోర్టు.. కీలకంగా మారిన కుమారుడి వాంగ్మూలం
యూపీలో 2016లో జరిగిన హత్యలో షాజహాన్ పూర్ లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కీలక తీర్పు వెలువరించారు. యూకేలో నివాసం ఉండే ఎన్ఆర్ఐ ఇక్కడ హత్యకు గురయ్యాడు. ఆయనను భార్య, తన స్నేహితుడి సాయంతో హతమార్చింది. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో హతుడి కుమారుడి వాంగ్మూలం కీలకంగా మారింది.

ఓ మహిళ రహస్య స్నేహితుడి సాయంతో తన భర్తను దారుణంగా హతమార్చింది. ఈ దారుణానికి ఒడిగట్టేందుకే యూకేలో ఉంటున్న భర్తను కుటుంబంతో సహా యూపీకి తీసుకొని వచ్చింది. ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసింది. అయితే ఈ ఘటనను తొమ్మిదేళ్ల కుమారుడు చూశాడు. అతడి వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. దీంతో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన 35 ఏళ్ల సుఖ్‌జీత్ సింగ్ (ఎన్ఆర్ఐ) తన భార్య రమణదీప్ కౌర్ మాన్ ఆరు, తొమ్మిదేళ్ల ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవారు. అయితే భార్య తన స్నేహితుడి సాయంతో భర్తను హతమార్చాలని భావించింది. దాని కోసం పథకం వేసింది. అందులో భాగంగా 2016 సంవత్సరంలో నెల రోజులు సెలువులు తీసుకొని ఇండియాలో యూకేలో గడుపుదామని భర్తను ఒప్పించింది.
దీంతో ఆ కుటుంబం అంతా యూపీకి వివాహర యాత్రకు బయలుదేరింది. అయితే మధ్యలో భార్య పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన గుర్ ప్రీత్ అనే తన చిన్ననాటి స్నేహితుడిని కూడా షాజహాన్ పూర్ కు తీసుకువచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆమె ఆహారంలో విషం ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ తినిపించింది. అయితే పెద్ద కుమారుడు ఆరోజు రాత్రి మ్యాగీ తినడంతో, ఆమె ఇచ్చిన ఆహారాన్ని వదిలేశాడు.
తరువాత తన స్నేహితుడి సాయంతో భర్తను హతమార్చింది. ఈ ఘోరాన్ని పెద్ద కుమారుడు గమనించాడు. తరువాత పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. ఆ బాలుడు 2016లోనే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘మా నాన్న గొప్పవారు. కానీ మా అమ్మ చెడ్డది. ఆమె నా కళ్ళముందే నా తండ్రిని చంపింది. అందుకే ఆమెను నేను ఎప్పుడూ చూడాలనుకోవడం లేదు. ఆమె మా నాన్న ముఖంపై దిండు పెట్టి గురుప్రీత్ ను గొంతు కోయాలని కోరింది.’’ అని చెప్పాడు. అయితే ఈ కేసులో బాలుడి వాగ్మూంలమే కీలకంగా మారింది.
ఈ కేసుపై షాజహాన్ పూర్ లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి పంకజ్ కుమార్ శ్రీవాస్తవ కోర్టు ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 34 (ఉమ్మడి ఉద్దేశ్యంతో అనేక మంది చేసిన నేరపూరిత చర్యలు) కింద రమణదీప్, గుర్ ప్రీత్ లను దోషిగా తేల్చింది. అక్టోబర్ 7వ తేదీన (రేపు)
శిక్షను నిర్ణయిస్తామని ప్రాసిక్యూషన్ న్యాయవాది అశోక్ కుమార్ ఖన్నా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. ‘‘ఆయుధ చట్టంలోని సెక్షన్ 4/25 కింద గుప్రీత్ ను దోషిగా తేల్చారు. తొమ్మిదేళ్ల కుమారుడి ముందే బాధితురాలి గొంతు కోసిన అరుదైన కేసు ఇది. దోషులిద్దరికీ మరణశిక్ష విధించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.