వేరే మహిళతో అల్లుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసి కోపం తెచ్చుకున్న మామ పలు మార్లు అతడిని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో దారుణంగా హత్య చేశాడు.
వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు అయినా ఒడిగట్టేలా చేస్తాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ. కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన అల్లుడు అని కూడా చూడకుండా సొంత మామే అతడిని హతమార్చాడు. బైక్ పై వస్తుండగా మధ్యలో కాపు కాసి మరి కొందరి సాయంతో అల్లుడిని చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ ఘటన విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుబ్బి తాలుకా కరిశెట్టిహళ్లిలో చౌకెనహళ్లిలో మూడ్లయ్య (40) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన ఆరు సంవత్సరాల కిందట జయణ్ణ కూతురును పెళ్లి చేసుకున్నాడు. అయితే మూడ్లయ్య కొంత కాలం నుంచి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం మామకు తెలిసింది.
వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని ఆపివేయాలని మామ సూచించాడు. అయినా అల్లుడిలో మార్పు రాలేదు. ఇలా ఎన్నో సార్లు చెప్పి చూసినా అల్లుడు మారలేదు. దీంతో అల్లుడిని చంపేయాలని మామ నిర్ణయించుకున్నాడు. గత సోమవారం మూడ్లయ్య అర్ధరాత్రి సమయంలో బైక్ పై ఇంటికి వస్తున్నాడు. అయితే మధ్యలోనే మామ, మరి కొంత మంది బైక్ ను అడ్డగించారు. మూడ్లయ్యను తీవ్రంగా కొట్టి చంపేశారు.
ఈ విషయంలో పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం ప్రారంభించారు. ఈ విచారణలో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. సొంత మామే పలువురితో కలిసి అల్లుడిని హత్య చేశాడని తెలుసుకున్నారు. ఈ ఘటనను ఛేదించారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న జయణ్ణతో పాటు అతడి కుమారుడు, మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఈ ఏడాడి జనవరిలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్ లోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురంకు చెందిన రాఘవేంద్ర (42) తాగుడికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యాయి. కొంత కాలం కిందట ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు.
కౌతాళం మండలం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని అక్కడే జీవించసాగాడు. అదే గ్రామంలో వ్యవసాయ పనులకు వెళుతున్న సమయంలో ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇటీవల వీరి వ్యవహారం విషయం వివాహిత భర్త హనుమంతురెడ్డికి తెలిసింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన అతడు రాఘవేంద్రను ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అదే గ్రామానికి చెందిన మూకయ్య సహకారం తీసుకున్నాడు.
ప్లాన్ ప్రకారం వీరిద్దరు రాత్రి నిద్ర ఉన్న రాఘవేంద్రను వేటకొడవలితో నరికి చంపేసారు. అరవకుండా ఒకరు రాఘవేంద్ర నోటిని మూసివుంచగా మరొకరు వేటకత్తితో నరికి చంపారు. ఇలా హన్మంతురెడ్డి, మూకయ్య సైలెంట్ గా రాఘవేంద్రను అతి దారుణంగా చంపేసారు. ఆ తర్వాత తమకేమీ తెలియదన్నట్లుగా వుండిపోయారు. రాఘవేంద్ర రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడివుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్వాడ్ తో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీస్ కుక్కలు హనుమంతు ఇంటిచుట్టూ తిరగడంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు. తన భార్యతో రాఘవేంద్ర అక్రమసంబంధాన్ని కొనసాగించడంతోనే హతమార్చినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ హత్యలో అతడికి సహకరించిన మూకయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
