జ్ఞానవాపి మసీదులోని నిర్మాణాన్ని శివలింగంగా పేర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మసీదు మేనేజ్‌మెంట్‌ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

జ్ఞాన్‌వాపి : ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో దొరికిన శివలింగం వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ సర్వేకి అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పక్షం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సర్వేలో ఈ శివలింగం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇది శివలింగం కాదని, ఫౌంటెన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది.

జ్ఞాన్‌వాపి మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ తరపున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ సమర్పించిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్‌ను శుక్రవారం విచారణకు జాబితా చేయడానికి అంగీకరించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశంపై దాఖలైన అప్పీల్ పెండింగ్‌లో ఉందని అహ్మదీ తెలిపారు. తీర్పు రిజర్వు అయి, పెండింగ్‌‌లో ఉన్నపుడు కార్బన్ డేటింగ్ కోసం మరో దరఖాస్తు దాఖలు చేశారని తెలిపారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపేందుకు సీజేఐ మొగ్గు చూపారు. కానీ అదే రోజు సైంటిఫిక్ సర్వే ప్రారంభమవుతుందని హుజెఫా చెప్పడంతో, దీనిపై శుక్రవారం (మే 19న) విచారణ జరుపుతామని చెప్పారు.

అంతకుముందు హిందూ పక్షం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లక్ష్మీ దేవి, మరి కొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు మే 12న ఆదేశాలు జారీ చేసింది. జ్ఞాన్‌వాపి మసీదులో కనుగొనబడిన నిర్మాణాన్ని 'శివలింగం'గా పేర్కొంటూ.. దాని వయస్సును నిర్ణయించడానికి కార్బన్‌ డేటింగ్‌ సహా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని ఆదేశించింది. 2022 అక్టోబరు 14న క్రింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. మే 2022లో జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో నిర్వహించిన సర్వేలో కనుగొనబడిన నిర్మాణాన్ని కార్బన్ డేటింగ్‌తో సహా శాస్త్రీయ పరీక్షలు చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. 'శివలింగం'పై శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న హిందూ పక్షం అభ్యర్థనపై చట్టం ప్రకారం కొనసాగాలని వారణాసి జిల్లా న్యాయమూర్తిని హైకోర్టు ఆదేశించింది.