మానీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ రిమాండ్ లో ఉన్నారు. అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. గతంలో నవాబ్ మాలిక్ తరఫు న్యాయవాది కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని  కోర్టు తిరస్కరించింది. కానీ నేడు ఆయన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించేందుకు కోర్టు ఒప్పుకుంది. 

మ‌నీలాండ‌రింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ జ‌ర‌ప‌డానికి సుప్రీంకోర్టు అంగీక‌రించింది. త‌క్ష‌ణం న‌వాబ్ మాలిక్ ను జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని కోరుతు నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది అత్య‌వ‌ర‌స పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే దీనిని బుధ‌వారం కోర్టు అంగీకరించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న మంత్రి త‌ర‌ఫు న్యాయ‌వాది కపిల్ సిబల్‌ను పత్రాలను అందించాలని కోరింది. ఈ ధ‌ర్మాస‌నంలో న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీలు కూడా స‌భ్యులుగా ఉన్నారు. 

ఈ సంద‌ర్భంగా న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ మాట్లాడుతూ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని అన్నారు. 2000 సంవత్సరానికి ముందు జరిగిన నేరాలకు సంబంధించి మంత్రిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని అన్నారు. కాబ‌ట్టి నిందితుడిని విడిచిపెట్టాల‌ని ఆయ‌న కోరారు. అయితే దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌డానికి కోర్టు ఒప్పుకుంది. 

గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహాయకులతో సంబంధం ఉన్న ఆస్తుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాలిక్‌ను ఫిబ్రవరి 23న అరెస్టు చేసింది. అరెస్టయిన వెంటనే మంత్రి తన అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిష‌న్ ను ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న జైలులోనే రిమాండ్ లో ఉన్నారు. 

మంత్రి నవాబ్ మాలిక్ జైలులో ఉండ‌టం వల్ల ఆయ‌న పోర్ట్ పోలియోల‌ను మ‌హరాష్ట్ర ప్ర‌భుత్వం ఇత‌రుల‌కు కేటాయించింది. అయితే ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి మాత్రం రాజీనామా చేయ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం ఎలాంటి శాఖ‌లు లేకుండానే ఆయ‌న మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే ఇదే ఈ కేసుకు సంబంధించి దావూద్ ఇబ్రహీం సోదరి దివంగత హసీనా పార్కర్ నివాసంతో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు జరిపారు. అలాగే హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది.

ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కు న‌వాబ్ మాలిక్ అత్యంత సన్నిహితుడు. ఎన్సీపీలో ఆయ‌న‌కు సీనియ‌ర్ లీడ‌ర్ గా పేరుంది. ఆయ‌న అరెస్టు అయిన వెంట‌నే శ‌ర‌ద్ ప‌వ‌ర్ స్పందించారు. బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే మాలిక్‌ను అరెస్టు చేశారని ఆయ‌న ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంద‌ని అన్నారు. న‌వాబ్ మాలిక్ కేంద్రాన్ని బ‌హిరంగంగా విమ‌ర్శించార‌ని, అందుకే ఆయ‌నను అరెస్టు చేశార‌ని తెలిపారు. ఇలా విమర్శ‌లు చేస్తే వేధింపులు ఉంటాయ‌ని త‌మ‌కు ముందే తెలుస‌ని చెప్పారు. ఏదో ఒక రోజు ఇలాంటిది జ‌రుగుతుంద‌ని తాము ఊహించామ‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యాంగ సంస్థ‌ల‌ను త‌మ స్వార్థం కోసం ఉప‌యోగించుకుంటోంద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిశారు. ఈడీ చ‌ర్య‌ల‌ను ఆక్షేపించారు.