బాలికపై అత్యాచారం.. బ్లీడింగ్ తో, అర్థనగ్నంగా వీధుల్లో తిరుగుతూ, వేడుకున్నా.. సాయం చేయని స్థానికులు.. చివరికి
మధ్యప్రదేశ్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురై, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నా బాలికకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. పైగా ఆమెను గేటు దగ్గరకు కూడా రానివ్వలేదు. చివరికి ఓ ఆశ్రమంలో పూజారి సాయం చేయడంతో బాధితురాలు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

కొన్ని ఘటనలు చూస్తే సభ్య సమాజం మళ్లీ అనాగరిక కాలంలోకి వెళిపోతోందేమో అని అనిపిస్తుంటుంది. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, సాయం చేయగలిగే అవకాశం ఉన్నా.. ముందుకు రాకపోవడాన్ని చూస్తే ప్రస్తుతం సమాజంలో మానవత్వం ఏ కోశానా లేదేమో అని బాధేస్తుంది. ఓ ఆడపిల్ల అత్యాచారానికి గురై, బట్టలు లేని స్థితిలో, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ సాయం చేయాలని వేడుకుంటున్నా.. ఆమెను చీదరించుకున్నారే తప్పా.. ఆదుకోలేదు. సభ్య సమాజం తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్ లో రాష్ట్రంలో జరిగింది.
‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లో భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. మరి ఆ బాలిక దుండగుల నుంచి తప్పించుకుందో లేక వారే ఆ బాలికను వదిలేసి వెళ్లిపోయారో తెలియదు గానీ.. బాధితురాలు ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్ నగర్ రోడ్డులో అర్థనగ్నంగా కనిపించింది. ఆ సమయంలో ఆమెకు బ్లీడింగ్ అవుతోంది. తీవ్ర నొప్పితో బాధపడుతూ, నవడానికి కూడా సత్తువ లేకున్నా సాయం కోసం వేడుకుంది. ఇంటింటికి వెళ్లి తనకు సాయం చేయాలని అభ్యర్థించింది.
ఆమె పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె చలించిపోతుంది. కానీ అక్కడున్న ప్రజలు బాధితురాలి పట్ల ఏ మాత్రమూ కనికరం చూపెట్టలేదు. బాధితురాలి సాయం చేయకుండా ఆమెను చీదరించుకున్నారు. గేటు దగ్గర నుంచే అటే వెళ్లిపోవాలని తోసేనంత పని చేశారు. కనీసం కప్పుకునేందు ఓ గుడ్డ ఇవ్వాలని ప్రదేయపడినా ఎవరూ ఇవ్వలేదు. మానవత్వం మంటగలిసిపోయిందని చూపే ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
చివరికి ఎలాగోలా బాధితురాలు అక్కడ ఉన్న ఓ ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ బాధితురాలి పరిస్థితి చూసిన ఓ పూజరి గుండె చలించిపోయింది. బాలికను ఆ స్థితిలో చూసిన ఆయనకు ఏం జరిగిందో అర్థం అయ్యింది. బాధితురాలు అత్యాచారానికి గురైందని గ్రహించిన ఆ పూజరి వెంటనే ఆమెను ఓ టవల్ తో కప్పారు. అనంతరం బాలికను జిల్లా హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.
ఆమెకు ఇతర గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ కు తరలించారు. రక్త స్రావం జరగడం వల్ల ఆమెకు రక్తం అవసరమైంది. దీంతో పోలీసు సిబ్బంది ముందుకొచ్చారు. బాధితురాలి కోసం రక్తం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి దీపికా షిండే మాట్లాడుతూ.. బాలిక తన పేరు, చిరునామా చెప్పలేకపోతుందని అన్నారు.
ఈ ఘటనపై గుర్తుతెలియని నిందితులపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టాన్ని కూడా ప్రయోగించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు.‘వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి నిశితంగా పరిశీలిస్తున్నాం. ఏదైనా సమాచారం వస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నేరం ఎక్కడ జరిగిందనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. బాధితురాలి యాస చూస్తుంటే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందినదిగా తెలుస్తోంది.’’ అని ఆయన పేర్కొన్నారు.