ప్రస్తుతం ముప్పు లేని కారణంగా పంజాబ్ లోని 184 మందికి ఆప్ ప్రభుత్వం పోలీసు భద్రతను ఉపసంహరించుకుంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఆ సమయంలో దాదాపు 122 మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులకు భద్రతను తొలగించింది.
పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 184 మంది వీవీఐపీల పోలీసు భద్రతను ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఆపదలో ఉన్న వ్యక్తులకు మాత్రమే భద్రత కల్పించాలని నిర్ణయించారు. వీవీఐపీల భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించిన తర్వాత పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రతను ఉపసంహరించుకోవాలని పంజాబ్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మన్‌ప్రీత్ కుమారులు, చరణ్‌జిత్ సింగ్ చన్నీ కుటుంబ సభ్యుల భద్రత నుంచి పోలీసు సిబ్బందిని వెనక్కి పిలిపించారు. ఈ నిర్ణయంతో 198 మంది భద్రతా సిబ్బంది, ఒక పోలీసు వాహనం వెనక్కి వచ్చింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది ప్రజా ప్రతినిధులకు, వీవీఐపీలు ప్రభుత్వ భద్రతను కోల్పొనున్నారు. ఇప్పటి వరకు వీరిలో పోలీసు సిబ్బందిని తమ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లోని వారి ఇళ్ల వద్ద భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారు.
పంజాబ్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుర్జిత్ సింగ్ రఖ్దా, సుచా సింగ్ ఛోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, బీబీ జాగీర్ కౌర్, గుల్జార్ సింగ్ రాణికే, తోట సింగ్, మదన్ మోహన్ మిట్టల్, సోహన్ సింగ్ తాండల్, రాజీవ్ శుక్లా, సంతోష్ చౌదరి, వరీందర్‌లకు భద్రత కోల్పోయారు. వీరితో పాటు 54 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రతను కూడా ఉపసంహరించుకున్నారు. వీరిలో వీర్ సింగ్ లోపోకే, మహేశీందర్ సింగ్, రాజ్‌విందర్ కౌర్ భాగీకే, గోవింద్ సింగ్ లాంగోవాల్, సురీందర్‌పాల్ సింగ్ సిబ్లా, విర్సా సింగ్ వాల్తోహా, రంజిత్ సింగ్ తల్వాండి, ప్రకాష్ సింగ్ భట్టి, జగ్బీర్ సింగ్ బ్రార్, అరుణేష్ షేకర్, సవీందర్ సింగ్, రాజ్‌బాన్స్ కౌర్ రానా, మొహిందర్ కుమార్ రిన్వాతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు
కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయ సలహాదారు కెప్టెన్ సందీప్ సంధూ, వివిధ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, పలువురు మంత్రులు, నేతల కుటుంబీకులు కూడా భద్రత కోల్పొయారు. భద్రత తొలగించిన వారిలో ఆదేశ్ కైరాన్ భార్య ప్రణీత్ కౌర్ కైరాన్, డీజీపీ ఎస్. ఛటోపాధ్యాయ కుమారుడు సిద్ధాంత్ చటోపాధ్యాయ, కాంగ్రెస్ నేత కుల్బీర్ సింగ్ జీరా తల్లి కుల్వంత్ కౌర్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కుమారుడు అర్జున్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేత కుల్జీత్ నాగ్రా భార్య మన్‌దీప్ కౌర్ నాగ్రా, కెప్టెన్ అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్, ఎస్‌ఏడీ నేత తోట సింగ్, పలువురు ఐఏఎస్‌లు ఉన్నారు. పలువురు ఐపీఎస్ అధికారుల కుటుంబాలను కూడా వెనక్కి తీసుకున్నారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను ఆప్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక రోజు తర్వాత అంటే మార్చి 11వ తేదీన 122 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతను ఉపసంహరించుకుంది. ఆ సారి భద్రతను కోల్పోయిన వారిలో మాజీ మంత్రులు భరత్ భూషణ్ అషు, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, రాజ్ కుమార్ వెర్కా, బ్రహ్మ్ మోహింద్రా, సంగత్ సింగ్ గిల్జియాన్, మాజీ స్పీకర్ కేపీ సింగ్ కూడా ఉన్నారు.
