అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ నిర్వహించారు. కానీ కొంత కాలం తరువాత ఆయన మరణించాడు. దహన సంస్కారాల అనంతరం బూడిదలో సర్జికల్ కత్తెర బయటపడింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. 

డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ ప్రాణం బలి అయ్యింది. రాజస్థాన్ లోని జైపూర్ లో గుండె శస్త్రచికిత్స చేసిన అనంతరం ఆ కత్తెరను లోపలే వదిలేశారు. దీంతో ఆ రోగి అస్వస్థతకు గురై మరణించారు. అయితే ఈ విషయం రోగి కుటుంబీకులకు ఆలస్యంగా తెలిసింది. బంధువులు, గ్రామస్తులందరూ కలిసి మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. అయితే మరుసటి రోజు అనంతరం ఎముకలను సేకరించేందుకు శ్మశానవాటికకు చేరుకోవడంతో వారికి సర్జికల్ కత్తెర లభించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

దీనిపై వెంటనే కుటుంబ సభ్యులు ఈ ఘటనకు కారణమైన హాస్పిటల్ ను సంప్రదించారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. కానీ ఈ ఘటనకు తాము కారణం కాదని, దానిని ఖండించారు. అయితే హాస్పిటల్ సిబ్బంది అబద్దాలు చెబుతున్నారని పేర్కొంటూ జవహర్ సర్కిల్ పోలీసులను వారు ఆశ్రయించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. నగరంలోని మానస సరోవర్ ప్రాంతానికి చెందిన ఉపేంద్ర శర్మ (74) అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడి కుమారుడు కమల్ తన తండ్రిని మే 29న (సోమవారం) ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 30వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో తండ్రిని ఆపరేషన్ కోసం తీసుకెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చారు.

మే 31వ తేదీ సాయంత్రానికి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి తీసుకువచ్చిన రెండు రోజుల తర్వాత తండ్రి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో ఆయన వెంటనే వైద్యులతో మాట్లాడాడు. అంతా సవ్యంగానే ఉంటుందని, అయితే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. కానీ ఉపేంద్ర శర్మ పరిస్థితి విషమించి జూన్ 12వ తేదీన రాత్రి 8.30 గంటలకు కన్నుమూశారు. మరుసటి రోజు మహారాణి ఫామ్ లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం కమల్ మృతదేహాన్ని సేకరించేందుకు శ్మశానవాటికకు వెళ్లగా సర్జికల్ కత్తెర కనిపించింది.

ఈ శస్త్రచికిత్స కత్తెర తండ్రిని పడుకోబెట్టిన దిశలోనే గుండె దగ్గర దొరికిందని కమల్ చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై ఫోర్టిస్ హాస్పిటల్ జోనల్ డైరెక్టర్ నీరవ్ బన్సాల్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల వాదన అవాస్తవమని, నిరాధారమైనదని అన్నారు. ఇది దురుద్దేశంతో కూడుకున్నదని తెలిపారు. ఆపరేషన్ చేసిన అనంతర నివేదికలు, రోగి ఎక్స్ రేలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. రోగి శరీరంలో శస్త్రచికిత్స కత్తెర గానీ, మరే ఇతర వస్తువు గానీ లేదని తెలిపారు. అలాంటి పొరపాట్లు జరగకుండా చూసేందుకు ఫోర్టిస్ కఠినమైన ప్రోటోకాల్స్ ను పాటిస్తుందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్సాది లాల్ మీనా ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.