నువ్వు మా సేవకుడివి, ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. నేను మంత్రి మేనళ్లుడిని, ఇది మా ప్రభుత్వం అంటూ ఓ యువకుడు పోలీసులపై బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఒక్క సారి పదవి దక్కితే చాలు తాము ఏం చేసినా చెల్లిపోతుందని అనుకుంటారు చాలా మంది నాయకులు. అంత వరకు అందరితో కలివిడిగా, సౌమ్యంగా ఉన్న నాయకులే పదవి రాగానే ఒక్క సారిగా కళ్లు నెత్తికెక్కుతాయి. దర్పం, పొగరు ప్రదర్శిస్తారు. ఎదుటి వారి పట్ల దురుసుగా ఉంటారు. ఆ నాయకులే ఇలా ప్రవర్తిస్తే.. ఇక వారి పిల్లలు, బంధువులు కూడా ఆయన పేరు చెప్పుకొని ఇష్టమొచ్చిన్నట్టు చేస్తుంటారు. ఇవి చాలా సందర్భాల్లో వెలుగులోకి కూడా వచ్చాయి. అందరూ అలాగే ఉంటారని చెప్పడం కరెక్ట్ కాదు కానీ.. కొందరు నాయకులు మాత్రం అలాగే ఉన్నారు.
కింది స్థాయి అధికారులతో, కానిస్టేబుల్స్ తో , టోల్ ప్లాజా సిబ్బందితో నాయకులు దుర్భాషలాడటం, తరువాత ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడం, తరువాత వారు క్షమాపణలు చెప్పడం వంటి విషయాలు గతంలో జరిగాయి. తాజాగా పోలీసులను మంత్రి మేనళ్లుడు తీవ్రంగా దుర్భాషలాడాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ తతంగం అంతా కెమెరాలో రికార్డు అవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. రాజ్‌గఢ్‌లోని ఓ వివాహ వేడుకలో డీజే నిలిపివేయడానికి పోలీసులు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా మేనళ్లుడు ఇందులో నిందితుడిగా ఉన్నాడు.
ఆదివారం తెల్లవారుజామున పచోర్ (pachore) పట్టణంలోని ఓ పెళ్లి వేడుకల్లో ఫుల్ సౌండ్ తో డీజే సాంగ్స్ పెట్టారు. అయితే మధ్య ప్రదేశ్ (madyapradhesh) లో ప్రస్తుతం కోవిడ్ -19 (covid -19) ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడకూడదు. అలాగే ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించాలి. సమాజిక దూరం పాటించాల్సి ఉంది. దీంతో ఈ డీజే (dj)ని నిలిపివేయడానికి హెడ్ కానిస్టేబుల్ సురేష్ మేవాడే (suresh mevade) తో పాటు మరో ఇద్దరు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ కార్యక్రమంలో ఉన్న మంత్రి మేనళ్లుడు పోలీసులను బెదిరించాడు. ‘‘ ఇక్కడ డీఐ ఎవరు ? వారిని పిలవండి.. నువ్వు మా సేవకుడివి. డీఐ (di)ని పిలవండి. నేను ఎంపీ మంత్రి మేనళ్లుడినని వారికి చెప్పండి ’’ అని అతడు ఒక అధికారికి చెప్పడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ‘‘ మనం అధికారంలో ఉన్నాము.. ఇది మా ప్రభుత్వం. మీరు మా సేవకులు’’ అని తన చుట్టూ ఉన్న ఇతరుల హర్షధ్వానాల మధ్య అతడు ఫోన్ లో చెప్పడం ఆ వీడియోలో వినొచ్చు. ‘‘జో ఉఖడ్నా హై ఉఖద్ లే’’ అని కూడా అన్నాడు. ఇలా మాట్లాడిన వ్యక్తిని ఉదయరాజ్ సింగ్‌గా గుర్తించారు.
ఈ ఘటన కు సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైరల్‌గా మారడంతో వివిధ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో నిందితుడిపై, డీజే యజమానిపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సంబంధిత సెక్షన్ల కింద, మధ్యప్రదేశ్ కోలాహల్ నియంత్రన్ అధినియం కింద కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.
