తన కూతురిపై అత్యాచారానికి పాల్పడి... ఆమె చావుకు కారణమైన వాడిపై ఓ తండ్రి పగ పెంచుకున్నాడు. ఏడేళ్ల తర్వాత కాపు కాసి మరీ... తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అంతమొందించాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తేని జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిన్నమనూర్‌ సమీపం సేలయాంపట్టి గ్రామానికి చెందిన కోచ్చడయాన్‌ కి ఒక కూమార్తె ఉండేది. భార్య అనారోగ్యంతో చనిపోవడంతో... కూతురిని కంటికి రెప్పలా పెంచుకున్నాడు. అందులోనూ ఆమె మూగది కావడంతో మరింత జాగ్రత్తగా చూసుకునేవాడు.   2013 లో ఒకరోజు కుమార్తెను ఇంట్లో ఒంటరిగా ఉంచి పనికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా కుమార్తె అత్యాచారానికి గురైంది. పక్కింటిలో నివసించే రత్నవేల్‌ పాండియన్‌ అనే యువకుడు ఆ బాలికపై అత్యాచారం చేసి పారిపోయాడు.

తనపై జరిగిన అఘాయిత్యానికి తీవ్రంగా కృంగిపోయిన ఆ బాలిక బయటకు చెప్పుకోలేక ఇల్లు వదిలి పారిపోయి ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు కారణమైన రత్నవేల్‌ పాండియన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.  నిందితుడు రత్నవేల్‌ పాండియన్‌ ఏడేళ్ల తర్వాత బెయిల్‌పై జైలు నుంచి బయటకు రాగా, అతని కోసమే ఎదురుచూస్తున్న కోచ్చడయాన్‌ దారుణంగా హతమార్చాడు. 

తన కుమార్తె మరణానికి కారకుడైన నిందితుని చంపి ప్రతీకారం తీర్చుకున్నాననే సంతోషంతో జైలుకు పోతున్నానని కోచ్చడయం పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.