The Kerala Story: వివాదాస్పద 'ది కేరళ స్టోరీ' చిత్రంపై కాంగ్రెస్ ఎంపీ, కేరళ నేత శశిథరూర్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. సుదీప్తో సేన్ రచించి, దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ చిత్రం కేరళలో అదృశ్యమైన మహిళ వెనకున్న కథలను తెలుపుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Congress leader & Thiruvananthapuram MP Shashi Tharoor: కేరళలో వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' రచ్చ కొనసాగుతోంది. రాజకీయ రంగు పూసుకున్న ఈ చిత్రం ఇప్పుడు కేరళ రాజకీయాలను హాట్ హాట్ గా మర్చింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'ని "సంఘ్ పరివార్ ప్రచారం" అని చిత్ర నిర్మాతలపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పినరయి విజయన్ సర్కారు, ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా 'ది కేరళ స్టోరీ' చిత్రంపై స్పందించారు. ఇది తమ కేరళ కథ కాదనీ పేర్కొన్నారు. ఇది వారి కేరళ కథ అంటూ విమర్శించారు. అదా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ను జతచేస్తూ ఆయన ట్వీట్ చేస్తూ "ఇది మీ కేరళ కథ కావచ్చు. ఇది మన కేరళ కథ కాదు" అంటూ పేర్కొన్నారు.
తప్పుడు వాదనలతో సమాజంలో మత విభేదాలు సృష్టించేలా ఈ సినిమా ఉందనీ, ఈ సినిమా ప్రదర్శనకు అనుమతించవద్దని కాంగ్రెస్ గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సుదీప్తో సేన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 5 న విడుదల కానుంది. కేరళలో అదృశ్యమైన మహిళలు, వారి నెనక ఉన్న సంఘటనలను గురించి ఈ చిత్రం వివరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, హిందీ సినిమా ట్రైలర్ మొదటి ట్రైలర్ లోనే మతపరమైన ధృవీకరణను సృష్టించడం.. రాష్ట్రానికి వ్యతిరేకంగా విద్వేష ప్రచారాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా నిర్మించినట్లు కనిపిస్తోందని సీఎం పినరయి విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు.
'లవ్ జిహాద్' అంశాన్ని దర్యాప్తు సంస్థలు, కోర్టులు, ఎంహెచ్ఏ తోసిపుచ్చినప్పటికీ, ప్రపంచం ముందు రాష్ట్రాన్ని కించపరిచేందుకే కేరళకు సంబంధించి ఈ చిత్రాన్ని ప్రధానాంశంగా లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు. ''కేరళలో 32 వేల మంది మహిళలను మతమార్పిడి చేసి ఇస్లామిక్ స్టేట్ లో సభ్యులుగా మార్చారని ఈ సినిమా ట్రైలర్ లో చూపించారు. ఈ బోగస్ కథ సంఘ్ పరివార్ అబద్ధపు ఫ్యాక్టరీ ఫలితమే'' అని సీఎం అన్నారు. రాష్ట్రంలో మతతత్వాన్ని వ్యాప్తి చేయడానికి, విభజనలు సృష్టించడానికి సినిమాలను ఉపయోగించడాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛగా సమర్థించలేమని విజయన్ అన్నారు. "అబద్ధాలు, మతతత్వాన్ని వ్యాప్తి చేయడం, రాష్ట్రంలో ప్రజలను విభజించడం లైసెన్స్ కాదు. అసత్య ప్రచారాల ద్వారా సమాజంలో మత అశాంతిని వ్యాప్తి చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలి" అంటూ మలయాళీలను హెచ్చరించారు.
