The Kerala Story: విద్వేషాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వివాదాస్పద సినిమా  'ది కేరళ స్టోరీ'  ప్రదర్శనను తక్షణమే నిషేధించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. కేర‌ళ స‌ర్కారు సైతం ఈ సినిమా పై ఆంక్ష‌లు విధించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేయ‌గా, విడుదలపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. 

'The Kerala Story' banned in West Bengal: 'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శనపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాత విపుల్ షా తెలిపారు. విద్వేషాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వివాదాస్పద సినిమా ప్రదర్శనను తక్షణమే నిషేధించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ఇదే అంశంపై సినిమా నిర్మాత స్పందిస్తూ... "ఒకవేళ ఆమె అలా చేస్తే మళ్లీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్ట నిబంధనల ప్రకారం సాధ్యమైనంత వరకు పోరాడతాం" అని విపుల్ షా పశ్చిమబెంగాల్ లో ది కేర‌ళ స్టోరీ చిత్రం నిషేధం గురించి విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఈ ట్రైలర్ లో ఏ ఒక్క వర్గాన్ని కించపరిచేలా ఏమీ లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) ఈ చిత్రాన్ని పరిశీలించి పబ్లిక్ ఎగ్జిబిషన్ కు అనువైనదిగా గుర్తించిందని అన్నారు. కాగా, బలవంతంగా మతం మార్చి ఐసిస్ లో చేరిన కేరళలోని మహిళల దుస్థితిని చిత్రించిన 'ది కేరళ స్టోరీ' రాజకీయ దుమారం రేపుతోంది. చాలా మంది బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మాట్లాడగా, కేరళలోని అధికార సీపీఐ (ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చిత్రంలో 32,000 మంది మహిళలు మతం మార్చబడ్డారనీ, తీవ్రవాదానికి గురయ్యారనీ, భారతదేశం-ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలలో నియమించబడ్డారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

నిరసనలకు భయపడి తమిళనాడులో పలు థియేటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడంతో చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, విపుల్ షా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిషేధం వల్ల కలిగే నష్టాల గురించి ప్రశ్నించగా, లాభనష్టాల గురించి ఇప్పుడే మాట్లాడబోమనీ, ఎక్కువ మంది సినిమా చూసేలా మాత్రమే ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్ర‌యివేటు వ్యక్తులు కానీ ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అన్ని విధాలుగా దానిపై పోరాటానికి ప్రయత్నిస్తామన్నారు. 'ది కేరళ స్టోరీ' సీరియస్ సోషల్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన సినిమా అనీ, సినిమాను సజావుగా, నిష్పక్షపాతంగా విడుదల చేసేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడులో ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని బెదిరించి విడుదలను నిలిపివేయాలని ఒత్తిడి తెచ్చారని ఆయన ఎవరి పేరు ప్రస్తావించకుండా చెప్పారు.

ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చినందున సినిమా విడుదలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్న‌ట్టు చెప్పారు. సినిమాను సజావుగా, నిష్పక్షపాతంగా విడుదల చేసేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేన‌ని తెలిపారు. సినిమాను చూడాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఇదిలావుండ‌గా, కర్ణాటకలోని బళ్లారిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ''దేశంలో ఇంత అందమైన రాష్ట్రం, ఇక్కడ ప్రజలు కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను 'కేరళ స్టోరీ' చిత్రం బయటపెడుతుంది'' అన్నారు. ఈ సినిమా ఇప్పుడు జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుందని షా అన్నారు.

''మన గౌరవనీయ ప్రధాని ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇతర ముఖ్య రాజకీయ పార్టీలు ఈ సినిమా గురించి మాట్లాడి ఈ అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా ప్రెజెంట్ చేశాయి. కొందరు మద్దతు తెలపగా, మరికొందరు వ్యతిరేకించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో దీన్ని ఎవరూ విస్మరించలేరని, ఇది మాకు గొప్ప విజయమని'' అన్నారు. ప్రచార చిత్రంగా ఉంటే ప్రజలు సినిమాను తిరస్కరించేవారని చిత్ర‌నిర్మాత‌లు తెలిపారు. కేరళలో విజయవంతంగా రన్ అవుతోందని, వచ్చే బుధ, గురువారాల్లో ఈ చిత్రాన్ని మలయాళంలో డబ్ చేస్తామని తెలిపారు. "ఆ ప్రయత్నం చేస్తున్నాం. కేరళలో తమకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, అందుకే కేరళలో ప్రజలు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని, కానీ తమిళనాడులో మాత్రం ఒక వ్యక్తి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని బందీగా పట్టుకున్నారని" అన్నారు.