ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాాజాగా ఈ సినిమాపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ లో చాలా అబద్దాలు చూపించారని ఆరోపించారు.
ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమాపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ సినిమా బృందాన్ని ప్రశంసిస్తుండగా.. మరి కొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సినిమాపై చాలా మంది రాజకీయ నేతలు తమ అభిప్రాయన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ నేతలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti), డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) ఈ చిత్రంపై స్పందించారు. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఈ సినిమాపై మాట్లాడారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో చాలా అబద్దాలు చూపించారని తెలిపారు.
శుక్రవారం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ (Kulgam) జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పొలిటికల్ ర్యాలీలో ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాపై వ్యాఖ్యలు చేశారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ డాక్యుమెంటరీనా లేదా సినిమానా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. “ ఇది ఒక డాక్యుమెంటరీ అయితే సరే, కానీ నిర్మాతలు ఈ చిత్రం వాస్తవికతపై ఆధారపడి ఉందని చెపుతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ సినిమాలో చాలా అబద్ధాలు ప్రసారం చేశారు. ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ సమయంలో NC (నేషనల్ కాన్ఫరెన్స్) ప్రభుత్వం ఉందని తప్పుగా చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్‌ను విడిచిపెట్టినప్పుడు 1990లో జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పాలన ఉంది. పైగా కేంద్రంలో వీపీ సింగ్ (VP Singh) నేతృత్వంలో ఉన్న ప్రభుత్వానికి బీజేపీ (BJP) మద్దతు ఉంది’’ అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
దీంతో పాటు ఒమర్ ఇంకా పలు వ్యాఖ్యలు చేశారు. “ కాశ్మీరీ పండిట్లు మరణించడం విచారకరం. కానీ ముస్లింలు, సిక్కులు కూడా చనిపోయారు. వలస వెళ్లిన చాలా మంది ముస్లింలు ఇంకా తిరిగి రాలేదు. కాశ్మీరీ పండిట్‌లు సజావుగా తిరిగి రావడానికి మా పార్టీ ఎప్పుడూ పని చేస్తుంది. అయితే ఈ చిత్రం మా ప్రణాళికలను దెబ్బతీసింది. ముస్లింలకు, పండిట్ లకు మధ్య అంతరాన్ని మరింత పెంచింది, అయితే మేము మా ప్రయత్నాన్ని వదిలిపెట్టబోము. కాశ్మీరీ పండిట్‌లు లోయకు తిరిగి వచ్చేందుకు మేము పోరాడుతాము ” అని ఆయన అన్నారు.
‘‘ ఈ సినిమా తీసిన తీయడం వల్ల మా ఇన్నేళ్ల పోరాటం ఫలించకపోవడం బాధాకరం. ముస్లింలు, పండిట్‌ల మధ్య అంతరాన్ని తగ్గించడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఇది విజయవంతం అవుతోంది. కానీ కాశ్మీర్ ఫైల్స్ సినిమా మా ప్రణాళికలను చెడగొట్టింది ” అని ఒమర్ వ్యాఖ్యానించారు.
గతంలో నేషన్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షుడు కూడా ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై ప్రశ్నలు సంధించారు. కాశ్మీర్ పండిట్ల వలసలపై దర్యాప్తు చేయాలని ఫరూక్ డిమాండ్ చేశారు. వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పరిస్థితిని ధ్రువీకరించిందని మెహబూబా ఆరోపించారు. ఇదిలా ఉండగా ది కాశ్మీర్ ఫైల్స్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర భద్రత పెంచింది. ఈ సినిమా విడుదల తరువాత ఆయనకు ముప్పు పెరిగిందని నివేదికలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆయనకు ‘వై’ కేటగిరి భద్రతతో పాటు దేశ వ్యాప్తంగా సీఆర్ పీఎఫ్ (CRPF) సెక్యూరిటీని కల్పించింది.
