రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 నాటి దెయ్యం దేశాన్ని వెంటాడటానికి తిరిగొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా సెటైర్లు వేశారు.
రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకోవడంపై దేశంలోని విపక్షాలు భగ్గుమంటున్నాయి. 2016 నాటి దెయ్యం దేశాన్ని వెంటాడటానికి తిరిగొచ్చిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత పవన్ ఖేరా సెటైర్లు వేశారు. ఇప్పటికీ పెద్ద నోట్ల రద్దు ఒక విపత్తుగా దేశాన్ని పట్టి పీడిస్తోందన్నారు. 2000 నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలను అప్పట్లో ప్రధాని మోడీ వెల్లడించారు. మరి 2000 నోట్లు ముద్రణ నిలిపివేసినప్పుడు ఆ వాగ్ధానాలన్నీ ఏమయ్యాయని పవన్ ఖేరా ప్రశ్నించారు. 2000 నోటు ఉపసంహరించుకోవడానికి గల కారణాన్ని ప్రభుత్వం వివరించాలి. ఇది ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక ఎజెండా అని పవన్ ఖేరా దుయ్యబట్టారు. దీనిపై మీడియా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన కోరారు.
మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం సైతం 2000 నోటు ఉపసంహరణపై విమర్శలు గుప్పించారు. ‘‘అనుకున్నట్లుగానే, ప్రభుత్వం/ఆర్‌బిఐ రూ. 2000 నోటును ఉపసంహరించుకున్నాయి. నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. రూ. 2000 నోటు ప్రజాదరణ పొందిన మాధ్యమం కాదని తాము ఈ విషయాన్ని నవంబర్ 2016లో చెప్పాం. 2000 నోటు జనాదరణ పొందిన విస్తృతంగా మార్పిడి చేయబడిన రూ. 500 , రూ. 1000 నోట్లను రద్దు చేయాలనే మూర్ఖపు నిర్ణయాన్ని కప్పిపుచ్చడానికి ఒక బ్యాండ్-ఎయిడ్ ’’ అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.
అంతకుముందు రూ.2000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ అవనీతి తగ్గాలంటే రూ. 2000, రూ.500 నోట్లు రద్దు కావాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ తానే ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి దేశ సంపదను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మనీలాండరింగ్ నియంత్రణ జరగాలని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
Also Read: రూ.2000 నోట్లను మార్చుకోవడం, డిపాజిట్ చేసుకోవడం ఎలా.. లిమిట్ ఎంత..?
కాగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. రూ. 2000 నోట్లను ఉపసంహరిస్తామని తెలిపింది. అయితే.. ఇప్పటికిప్పుడే వీటిని రద్దు చేయడం లేదు. ఇవి చెలామణిలో ఉంటాయని తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. లేదా.. తమ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాలని తెలిపింది. అలాగే.. రూ. 2,000 నోట్లను ఖాతాదారులకు జారీ చేయవద్దని తక్షణ ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం ఆర్బీఐ ఎందుకు తీసుకున్నది? ఈ నిర్ణయంపై ఏమంటున్నది?
