Dogs attackd on leopard : చిరుతపులిపైనే దాడి చేసిన కుక్కలు.. తోకముడిచి పారిపోయిన క్రూర మృగం.. వీడియో వైరల్..
ఓ చిరుతపులిపై పలు కుక్కలు దాడి చేశాయి. దానిని తరిమికొట్టాయి. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా చిరుత పులిని చూస్తే అందరూ భయపడతారు. జంతువులు కూడా దానిని చూసిన వెంటనే పరుగులు పెడతాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు వెనుదిరిగి చూడకుండా పరుగెత్తుతాయి. కుక్కలు కూడా దానికి అతీతం కాదు. కానీ మహారాష్ఠ్రలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. రెండు కుక్కలు కలిసి ఏకంగా చిరుతపులిపైనే దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాలు ఇలా ఉన్నాయి. అది మహారాష్ట్రలోని పూణె సిటీ ధోల్వాడ్ ప్రాంతం. అక్కడి ఓ కాలనీలోని ఇంట్లో పెంపుడు కుక్క ఉంది. అయితే గత బుధవారం రాత్రి 2 గంటల దాటిన తరువాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ ఇంటి కాంపౌండ్ లోకి ఓ చిరుత పులి ప్రవేశించింది. దీనిని ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క గమనించింది.
ఇంకేముంది.. తనకు అపాయమని తెలిసిన ఆ ఇంటి యజమానులను ఆ క్రూర జంతువును రక్షించేందుకు పూనుకుంది. వెంటనే ఆ చిరుతపై దాడి చేసింది. ఈ కుక్క అరుపులు విన్న పలు వీధి కుక్కలు వెంటనే అక్కడికి చేరున్నాయి. అవి కూడా చిరుతపులిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. వాటి దాడిని కొంత సమయం పాటు చిరుతపులి ధైర్యంగా ఎదుర్కొంది. కానీ వాటిని ఎక్కువ సేపు తట్టుకోలేకపోయింది.
వెంటనే అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. ఇదంతా ఆ ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దానిని పలువురు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చిరుతపులిని ఎదురించిన కుక్కల ధైర్య సాహసాలను నెటిజన్లు కొనియాడుతున్నారు.