ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి ఘటనపై హైకోర్టు స్పందించింది. దీనిపై రెండు వారాల్లో నివేదిక కావాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలే కాశ్మీర్ పండిట్లపై కేజ్రీవాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) ఇంటిపై దాడి ఘ‌ట‌న‌లో రెండు వారాల్లోగా పూర్తి స్థాయి నివేదిక‌ను అంద‌జేయాల‌ని పోలీసుల‌ను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ నివేదిక సీల్డ్ క‌వ‌ర్ లో ఉంచి హైకోర్టు (high court) ముందు ఉంచాల‌ని చెప్పింది. దాడి చేస్తున్న స‌మ‌యంలో రికార్డు అయిన సీసీటీవీ (CCTV) ఫుటేజీల‌ను భ‌ద్ర‌ప‌ర్చాల‌ని తెలిపింది. 

సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంపై జరిగిన దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bhardwaj) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దాడిపై స్వతంత్ర, న్యాయమైన, కాలపరిమితితో కూడిన నేర విచారణను చేప‌ట్టాల‌ని, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేయాలని సౌరభ్ భరద్వాజ్ విజ్ఞ‌ప్తి చేశారు. అయితే దీనిపై శుక్ర‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. 

ఆప్ త‌రుఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) హైకోర్టులో వాద‌న‌లు వినిపించారు. కేజ్రీవాల్ నివాసంపై దాడి చేస్తున్న స‌మ‌యంలో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీల‌ను భ‌ద్ర‌ప‌ర్చాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని, అలాగే పీఎం భద్రతా ఉల్లంఘన విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఉదహరించాలని కోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై ఇదే తరహాలో సిట్‌ విచారణను కోరుతున్నామని న్యాయ‌వాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఏఎస్‌జీ సంజయ్ జైన్ స్పందించారు. భద్రతాపరమైన ముప్పును పరిష్కరిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశామని చెప్పారు. 

ఇటీవ‌ల ఢిల్లీ అసెంబ్లీ (delhi assembly)లో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కాశ్మీరీ పండిట్ల ఊచకోత అబద్ధమని పేర్కొన్నారు. ద కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్ర‌చారం చేస్తున్న బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ఆ సినిమాపై వ‌చ్చిన లాభాల‌ను కాశ్మీర్ పండిట్ల కోసం ఖ‌ర్చు చేయాల‌ని సూచించారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ ఎందుకు మిన‌హాయించ‌డం అని, య్యూటూబ్ లో పెడితే దేశ ప్ర‌జ‌లంద‌రూ ఉచితంగా చూస్తార‌ని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్య‌లపై భారతీయ జనతా యువ మోర్చా (BJYM) స‌భ్యులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఐపీ కాలేజీ సమీపంలోని లింక్ రోడ్‌లోని కేజ్రీవాల్ నివాసం వెలుపల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. పోలీసులు వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

ఈ ఘ‌ట‌న‌పై అర‌వింద్ కేజ్రీవాల్ గురువారం తొలిసారిగా స్పందించారు. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న త‌న నివాసంపై దాడి ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ.. దేశంలోని అతిపెద్ద పార్టీ గూండాయిజానికి పాల్పడ‌టం ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సందేశాన్ని పంప‌డ‌మే అవుతుంద‌ని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యం కాద‌ని, దేశమే ముఖ్యమ‌ని అన్నారు. తాను దేశం కోసం నా ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. 

ఇలాంటి గూండాయిజంతో భారతదేశం పురోగమించద‌ని అన్నారు. ఇలాంటి ప‌నుల వ‌ల్ల ప్రజలు ఇదే సరైన మార్గమ‌ని భావిస్తారు అని తెలిపారు. ఈ పోరాటంలో ఇప్పటికే 75 ఏళ్లు వృథా చేశామని చెప్పారు. దేశమే ముఖ్యమ‌ని చెప్పారు. అంద‌రూ క‌లిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని సూచించారు. కాగా ముఖ్యమంత్రి నివాసం వెలుప‌ల‌ విధ్వంసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీల సాయంతో మిగిలిన నిందితులను గుర్తించి, వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.