ఢిల్లీ: రైతులకు వరాల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్రమోదీ. రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ శుక్రవారం సాయంత్రం కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో రైతులకు వరాలుజల్లు కురిపించారు. 

రైతులందరికీ ఉపయోగపడేలా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా రైతులందరికీ పెట్టుబడి సాయంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రతీ రైతుకు ఏడాది రూ.6వేల రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రం ఇవ్వనుంది. 

ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 హెక్టార్లు దాటి ఉన్నవారికి మాత్రమే పథకం వర్తింపజేయాలని ఉన్న నిబందనను తొలగించినట్లు తెలిపారు. 

ఈ పథకంతోపాటు ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన పేరుతో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల పెన్షన్ పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 

60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3వేలు పెన్షన్ పొందనున్నారు. అలాగే పెట్టుబడి సాయాన్ని పెన్షన్ పథకానికి మళ్లించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

మరోవైపు జూలై 5న కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. జూన్ 19న లోక్ సభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారని అనంతరం జూన్ 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నట్లు తెలిపారు. జూన్ 17 నుంచి జూలై 20 వరకు లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి. మెుదటి రెండు రోజులు ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.