ట్రక్కు డ్రైవర్ల దేశ వ్యాప్త నిరసనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం..
దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నేటి రాత్రి 7 గంటలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా డ్రైవర్ల యూనియన్లతో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ఢిల్లీలో జరగనుంది.
హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించే నూతన క్రిమినల్ చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారు. సోమవారం మొదలైన ఈ నిరసనలు మంగళవారమూ కొనసాగాయి. ఇందులో భాగంగా నేషనల్ హైవేలను డ్రైవర్లు దిగ్భందించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే ఈ నిరసనలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది.
ట్రక్కు డ్రైవర్ల యూనియన్లతో రాత్రి 7 గంటలకు చర్చలు జరుపుతామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది. కాగా.. భారతీయ న్యాయ సంహిత కింద హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 7 లక్షల జరిమానాతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం తీసుకొచ్చిన నిబంధనే ఈ డ్రైవర్ల ఆందోళనకు కారణమైంది.
డ్రైవర్ల డిమాండ్ ఏమిటి ?
కొత్త చట్టాల ప్రకారం.. డ్రైవర్లు కఠిన చర్యలు ఎదుర్కోకుండా కఠిన నిబంధనలను సమీక్షించేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ వెల్ఫేర్ అసోషియేషన్ (ఏఐటీడబ్ల్యూఏ) కోరుతోంది. ఈ విషయంలో డ్రైవర్లకు నమ్మకం కలిగించడానికి ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడం ప్రస్తుతం చాలా ముఖ్యమని చెబుతోంది.
కాగా.. సోమవారం నుంచి జరుపుతున్నఈ సమ్మె వల్ల వాహనాల రాకపోకలు, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్లలో డ్రైవర్లు రహదారులను దిగ్బంధించారు. అనేక రాష్ట్రాల్లో కూడా రోడ్లపై ధర్నాలు చేశారు. అయితే ట్రక్కు డ్రైవర్ల నిరసన వల్ల ఇందన కొరత రాబోతోందనే ఆందోళన నెలకొంది. దీంతో చాలా రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. డ్రైవర్లు ఆందోళన విరమించకపోతే పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోతాయనే వాహనదారులు ఇందనం కోసం క్యూ కడుతున్నారు.